ఆప్ఘనిస్థాన్ లో తీవ్ర భూకంపం.. 1000 మందికి పైగా మృతి 1500 మందికి గాయాలు
-పాక్ సరిహద్దు ఖోస్ట్ పట్టణానికి చేరువలో భూకంప కేంద్రం
-రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు
-మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు
-రాత్రి అందరు నిద్రిస్తుండగా 1 :30 భూకంపం (తెల్లవారుజామున )
-నిద్రలోనే చనిపోయిన వారు అనేక మంది
ఆప్ఘనిస్థాన్ ను తీవ్ర భూకంపం కుదిపేసింది. దీని కారణంగా 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం ఈ విపత్తు సంభవించింది.1500 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని భావిస్తున్నారు. గాయపడినవారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం … అక్కడకు చేరుకున్న రెస్క్యూ టీంలు సహక చర్యల్లో నిమగ్నమైయ్యాయి.
పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఖోస్ట్ పట్టణానికి 44 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. రాజధాని కాబూల్ లోనూ బలమైన కుదుపులు వచ్చినట్టు స్థానికులు చెప్పారు. ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా వచ్చిన ఈ భూకంపానికి ఎటుపోవాలో ఏమి జరుగుందో తెలియక నాయిక మంది మృత్యువాత పడ్డారు . మృతుల్లో ఎక్కువ మంది తూర్పు ఆఫ్ఘన్ లోని పక్తికా ప్రావిన్స్ కు చెందిన వారే ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లను సహాయక చర్యల కోసం రంగంలోకి దించారు.
భూకంప సమయంలో ప్రకంపనలు పాకిస్థాన్, భారత్ లోని కొన్ని ప్రాంతాలకు సైతం వ్యాపించినట్టు సమాచారం. ఆప్ఘనిస్థాన్ పాలనా పగ్గాలను తాలిబాన్లు హస్తగతం చేసుకున్న తర్వాత ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ సమయంలో ఈ విపత్తు రావడం మరింత నష్టమేనని చెప్పుకోవాలి. ప్రపంచ దేశాలను ఆఫ్ఘన్ ప్రభుత్వం సహాయం అర్థించింది. మానవతా దృక్పథం తో సహాయం చేయాలనీ విజ్ఞప్తి చేసింది.