మోడీ టూర్ కు వెళ్దామనుకున్నా-కానీ అది చూసి ఆశ్చర్యపోయా-రఘురామ షాకైన వేళ..
ఆహ్వానించిన జాబితాలో రఘరామ పేరు లేదు
కొన్ని విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలాగే ఉంటాయన్న ఎం పీ
కేంద్రానికి లేఖ రాసినా నాపేరు చేర్చకపోవడం దారుణం
ప్రధాని మోడీ భీమవరం టూర్ ఇవాళ పలు సంచలనాలకు కారణమైంది. ఈ టూర్ కు విపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో ఈ టూర్ లో పాల్గొనాల్సిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు జగన్ సర్కార్ చివరి నిమిషంలో షాకిచ్చింది. హైదరాబాద్ నుంచి బయలుదేరి భీమవరం వెళ్లేందుకు సిద్దమవుతున్న రఘురామరాజుకు అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు.
ప్రధాని మోడీ భీమవరం టూర్ లో పాల్గొనేందుకు ఆహ్వానించిన అతిధుల జాబితాలో వైసీపీ రెబెల్ ఎఁపీ రఘురామకృష్ణంరాజు పేరు లేదు. దీంతో ఆయన ఈ టూర్ కు వెళ్లేందుకు అనుమతి లభించలేదు. చివరికి విషయం తెలిసి ఆయన హైదరాబాద్ లోనే ఉండిపోయారు. దీనిపై ఆయన స్పందించారు. ప్రధాని వస్తున్నారని కార్యక్రమానికి హాజరవుదామనుకున్నానని, అయితే తనను సభకు వెళ్లకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలాగే ఉంటాయని రఘురామ వ్యాఖ్యానించారు. విషనాగులే పాలకులవుతారని, ఆనాడు అంబేద్కర్ అనుకోలేదని రఘురామ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులుంటాయని తెలిస్తే రాజ్యాంగాన్ని మరోలా రాసేవారని తెలిపారు. ఇలాంటి నాయకులు ఏపీని పాలిస్తుండడం దురదృష్టకరమన్నారు.
ప్రధాని మోడీ భీమవరం టూర్ లిస్ట్ లో తన పేరు లేదని తెలిసి ఆశ్చర్యపోయానని రఘురామరాజు చెప్పారు. ముందే ప్రొటోకాల్ సమస్యలపై కేంద్రానికి లేఖ రాశానని, అయినా తన పేరును లిస్టులో ఎందుకు చేర్చలేదో అర్థం కావట్లేదన్నారు. కోర్టులు ఆదేశించినా పట్టించుకోకపోతే ఏమనాలి? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.