- హైదరాబాద్ శివారు పఠాన్ చెరులో కోడి పందేలు
- తాము రెయిడ్ చేసినప్పుడు చింతమనేని పరారయ్యారన్న డీఎస్పీ
- చింతమనేని ప్రభాకర్ కోసం గాలిస్తున్నామని వెల్లడి
హైదరాబాద్ శివార్లలోని పటాన్ చెరు ప్రాంతంలో జరిగిన కోడి పందేల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే కోడి పందేల్లో లేని వ్యక్తిని అక్కడ ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని… ఇంతటి రాక్షస రాజకీయాలు అవసరమా అని చింతమనేని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో పఠాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి మాట్లాడుతూ, పటాన్ చెరు శివారు ప్రాంతాల్లోని మామిడితోటలో కోడి పందేలు జరిగాయని చెప్పారు. ఈ పందేల మెయిన్ ఆర్గనైజర్ చింతమనేని ప్రభాకర్ అని తెలిపారు. తాము మఫ్టీలో రెయిడ్ చేసినప్పుడు చింతమనేని తప్పించుకుని పరారయ్యారని చెప్పారు.
కృష్ణంరాజు, అక్కినేని సతీశ్, బర్ల శీనులు ఈ పందేలను ఆర్గనైజ్ చేశారని… వీరు కూడా చింతమనేని పేరు చెప్పారని వెల్లడించారు. చింతమనేని కోడి పందేలు ఆడిస్తున్న వీడియో తమ వద్ద ఉందని తెలిపారు. సోషల్ మీడియాలో చింతమనేని పెట్టిన పోస్ట్ కు తాము కౌంటర్ ఇస్తామని చెప్పారు.
చింతమనేని ప్రభాకర్ కోసం గాలింపు చర్యలను చేపట్టామని… దీని కోసం మూడు గాలింపు బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ తెలిపారు. చింతమనేనితో పాటు మరో 40 మంది పరారయ్యారని చెప్పారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు.