తక్షణ సహాయం కింద వరద ప్రభావిత 4 జిల్లాలకు 8 .30 కోట్లు :సీఎం కేసీఆర్!
-ఏటూరునాగారంలో వరద పరిస్థితులపై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్
-ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్న అధికారులను అభినందించిన సీఎం
-గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు …ఇప్పుడు శాశ్విత నిర్మాణాలు చేపట్టాలి
-ఇందుకోసం కార్యాచరణ రూపొందించాలి బుక్లెట్ తయారు చేయాలి
-గోదావరి పరివాహక ప్రాంతాల్లో రెండు హెలికాప్టర్ లు సిద్ధంగా ఉండాలి
-ఒకటి ములుగు కేంద్రంలోను …మరొకటి భద్రాచలంలో ఉండాలి
వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సహాయం కింద ప్రత్యేకంగా నిధులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా ములుగు జిల్లాకు రూ.2 కోట్ల 50 లక్షలు, భద్రాచలం జిల్లాకు రూ.2 కోట్ల 30 లక్షలు, భూపాలపల్లి జిల్లాకు రూ.2 కోట్లు, మహబూబాబాద్ కు రూ. 1 కోటి 50 లక్షలు మంజూరు చేస్తున్నామని సీఎం తెలిపారు.
ఏటూరు నాగారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. నెలాఖరు వరకూ భారీ వర్షాలుంటాయన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంత పెద్ద భారీ వర్షాలు వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ప్రతి శాఖ అధికారులు మూడు షిఫ్టులుdగా పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను దశలవారీగా ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని సీఎం అన్నారు.
గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని, కానీ, ఇపుడు ఎన్ని నిధులు ఖర్చయినా సరే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరద పరిస్థితులపై భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేకంగా ఒక బుక్ ను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరదతో చాలా చోట్ల మిషన్ భగీరథ పైపులు దెబ్బతిన్నాయని, వాటికి తక్షణమే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. ములుగు జిల్లాకేంద్రంలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు కోరినందున దీన్ని వెంటనే మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
రెండు హెలీకాప్టర్లు సిద్ధంగా ఉంచాలి
వర్షాలతో వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగు జిల్లా కేంద్రంలో ఒక హెలీకాప్టర్ ను, భద్రాచలంలో మరొక హెలీకాప్టర్ ను సిద్ధంగా ఉంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పాత బ్రిడ్జిలు, కాజ్ వేలు, కల్వర్టులను వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.విద్యుత్ సౌకర్యాన్ని కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు.