2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలమే.. ఐఎంఎఫ్ ఆందోళన!
- ఇప్పటికే కొవిడ్, ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయన్న ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా
- ఇప్పుడు ఆర్థిక మాంద్యం పరిస్థితి తలెత్తుతోందని వెల్లడి
- ఇటీవల ఓ వ్యాసంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితిని వివరించిన క్రిస్టలినా
ఇప్పటికే కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ పై రష్యా దాడి పరిణామాలతో కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వచ్చే కొన్నేళ్లు గడ్డుకాలమేనని ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జియేవా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సంవత్సరం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. 2023లో అయితే పరిస్థితి మరింతగా దిగజారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఆమె ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితికి సంబంధించి ఓ వ్యాసం రాశారు.
మాంద్యం మొదలైంది..
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితి ఇప్పటికే మొదలైందని.. ఈ ముప్పు మరింతగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఉక్రెయిన్– రష్యా యుద్ధం తర్వాతి పరిణామాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల నుంచి ఎలక్ట్రానిక్స్ దాకా అన్నింటి ధరలు పెరిగాయని, ఇవి ద్రవ్యోల్బణానికి కారణమయ్యాయని క్రిస్టలినా తెలిపారు. ఇప్పట్లో ఈ పరిస్థితి చక్కబడే అవకాశం కనిపించడం లేదని.. దేశాలు ఈ సమస్య నుంచి బయటపడేందుకు గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
చైనా మందగమనంలోకి..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక మద్దతుదారు అయిన చైనాలో మందగమనం చాలా దేశాలపై ప్రభావం చూపిస్తోందని క్రిస్టలినా తెలిపారు. మిగతా పెద్ద దేశాల ఆర్థిక వృద్ధి గనుక వెనక్కి తగ్గితే.. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం తప్పదన్నారు. ఇక ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిస్థితులు ఇలాగే ఉంటే వృద్ధి మందగిస్తుందని పేర్కొన్నారు.