భారత 15 రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము… విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి
- మూడో రౌండ్ పూర్తి అయ్యేసరికి 2,161 ఓట్లు సాధించిన ముర్ము
- యశ్వంత్‌కు 1,058 ఓట్లు లభించిన వైనం
- ముర్ము విజయంపై ప్రకటన ఇక లాంఛనమే
- ఈ నెల 25న భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్న ముర్ము
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. గురువారం ఢిల్లీలోని పార్లమెంటు వేదికగా జరుగుతున్న ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే ఆమె విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండగానే… రాత్రి 8 గంటల ప్రాంతానికే పూర్తి ఓట్లలో సగానికిపైగా ఓట్లను దక్కించుకున్న ముర్ము ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికే తన సమీప ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ ఆధిక్యత సాధించిన ముర్ము.. మూడో రౌండ్‌లోనే అధిక్యం కొనసాగించారు. ఈ క్రమంలో మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే ఆమె విజయం ఖరారైంది.
వరుసబెట్టి మూడు రౌండ్లలోనూ స్పష్టమైన ఆధిక్యత కనబరచిన ముర్ము మూడో రౌండ్ పూర్తి అయ్యే సరికి 2,161 ఓట్లు వచ్చాయి. దీంతో సగానికి పైగా ఓట్లను సాధించిన ముర్ము విజేతగా నిలిచారు. ఇక మూడో రౌండ్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి యశ్వంత్ సిన్హాకు 1,058 మాత్రమే వచ్చాయి. దీంతో ద్రౌపది ముర్ము విజయం ఖాయమైపోయింది. మరికాసేపట్లోనే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించినట్లు అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ నెల 25న ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ద్రౌపది ముర్ము ఇంటికెళ్లి అభినందనలు తెలిపిన మోదీ!
జేపీ నడ్డాతో కలిసి ముర్ముకు అభినందనలు తెలిపిన ప్రధాని
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే తన సమీప ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజారిటీతో ముర్ము విజయం సాధించారు. ప్రస్తుతం నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ రౌండ్ పూర్తయ్యాక ముర్ముకు మొత్తం మీద దక్కిన ఓట్లెన్ని అన్న విషయం తేలనుంది.
ఇదిలా ఉంటే… నేటి రాత్రి 8 గంటల సమయంలో ముర్ము తన విజయానికి సరిపడ మేర ఓట్లను సాధించారన్న సమాచారం తెలియగానే… ప్రధాని మోదీ నేరుగా ముర్ము నివాసానికి బయలుదేరారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాతో కలిసి ముర్ముతో భేటీ అయిన మోదీ… భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముర్ము వ్యక్తిత్వాన్ని, విజయాన్ని ఆకాశానికెత్తేసిన మోదీ… ఆమెకు ఓటేసిన ప్రజా ప్రతినిధులను అభినందిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
ద్రౌపది ముర్ముకు మిఠాయి తినిపించిన అమిత్ షా…
ముర్ముకు ఇంటికి వచ్చి అభినందనలు తెలిపిన అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్
భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు, పార్టీల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బీజేపీ నేతల సంబరాలకైతే హద్దే లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా బీజేపీ పెద్ద ఎత్తున సంబరాలను మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఢిల్లీలోని ముర్ము నివాసానికి బీజేపీ అగ్ర నేతలు క్యూ కట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి అందరికంటే ముందు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ… ముర్ముకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
అనంతరం, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అక్కడికి వచ్చారు. ముర్ముకు అభినందనలు తెలిపిన అమిత్ షా… తన చేతులతో ఆమెకు మిఠాయి తినిపించారు. ఈ ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమిత్ షా అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ముర్ము నివాసానికి వచ్చి ఆమెకు అభినందనలు తెలిపారు.
ఓటమిని అంగీకరించి విజేతకు అభినందనలు తెలిపిన యశ్వంత్ సిన్హా!రాష్ట్రపతిగా నిర్భయంగా వ్యవహరించాలని ముర్ముకు సూచన
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పరిణతి కలిగిన రాజకీయ నేతగా తనను తాను నిరూపించుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తుది ఘట్టమైన ఓట్ల లెక్కింపులో లెక్కింపు పూర్తి కాకుండానే విజయానికి సరిపడ ఓట్లను సాధించిన అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఆయన అభినందనలు తెలిపారు. అంతేకాకుండా ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగానే ఆయన తన ఓటమిని అంగీకరించారు. ఈ మేరకు గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఓ ప్రకటన విడుదల చేశారు. దానిని ట్విట్టర్ వేదికగానూ ఆయన పంచుకున్నారు.
అధికార పక్షానికి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉందని తెలిసి కూడా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన యశ్వంత్ సిన్హా ఓటు హక్కు కలిగిన ప్రజా ప్రతినిధులు తమ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల్లో ఓటమి ఖరారు కాగానే.. విజేత ద్రౌపది ముర్ముకు ఆయన అభినందనలు తెలిపారు. భారత రాష్ట్రపతిగా విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పాక్షికంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆయన ముర్ముకు సూచించారు.