రేపు 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం…
సీజేఐ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణస్వీకారం చేయిస్తారు
రాష్ట్రపతి భవన్ కు పదవి విరమణ చేసిన రాష్ట్రపతి , ఎన్నికైన రాష్ట్రపతి చేరుకుంటారు
21 తుపాకులతో గౌవర వందనం
న్యూఢిల్లీ: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత 21 తుపాకులతో గౌవర వందనం స్వీకరించనున్నారు. ఉదయం 10.15గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగే ఈ వేడుకలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో రాష్ట్రపతిగా ప్రమాణం చేయిస్తారని కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది. వేడుకకు ముందు పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి, కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతులు ఊరేగింపుగా పార్లమెంట్‌కు చేరుకుంటారని హోంశాఖ పేర్కొంది.
ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల చీఫ్‌లు, పార్లమెంట్ సభ్యులు, ప్రధాన సైనిక అధికారులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. వేడుక అనంతరం రాష్ట్రపతి సెంట్రల్ హాలు నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. అక్కడ నూతన రాష్ట్రపతి ఇంటర్ సర్వీసెస్ గౌరవ వందనం సమర్పించనున్నది. ఇదిలా ఉండగా.. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను పాక్షికంగా మూసివేయాలని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.