Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నూతన రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము!

  • నూతన రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము!
    -ప్రమాణం చేయించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
    -పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన కార్యక్రమం
    -ముర్మును తోడ్కొని వచ్చిన ఉప రాష్ట్రపతి, స్పీకర్ 
    -తాను రాష్ట్రపతి భవన్ కు రావడం దేశంలోని పేద ప్రజలందరి విజయమన్న ముర్ము
    -ఆజాదీకా అమృత్ మహోత్సవాల వేళ రాష్ట్రపతిగా బాధ్యతలను చేపట్టడం సంతోషకరం
    -ప్రతి ఒక్కరికీ ప్రాథమిక విద్య అందాలనేదే నా ఆకాంక్ష
Droupadi Murmu Took oath as the 15th President of India

భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేడు ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. దీంతో భారత్ కు ఆమె 15వ రాష్ట్రపతి అయ్యారు. అలాగే ఈ పదవిని చేపట్టిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము రికార్డుల్లోకి చేరారు. మరోపక్క, అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. అంతేకాదు, రాష్ట్రపతి పదవిని అలంకరించిన అతి పిన్న వయసు వ్యక్తి కూడా ఆమె కావడం గమనార్హం.

పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ద్రౌపది ముర్మును పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి తొడ్కొని వచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై గెలవడం తెలిసిందే. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆమె గతంలో ఆ రాష్ట్ర మంత్రిగా రెండేళ్లపాటు పనిచేశారు. ఝార్ఖండ్ గవర్నర్ గానూ సేవలందించారు.

ఇది నా వ్యక్తిగత విజయం మాత్రమే కాదు..: జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం…

భారత దేశ తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా 64 ఏళ్ల ద్రౌపది ముర్ము పదవీ బాధ్యతలను చేపట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం రాష్ట్రపతి హోదాలో జాతిని ఉద్దేశించి ఆమె తొలి ప్రసంగం చేశారు. దేశ అత్యున్నత పదవికి తనను ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల వేళ రాష్ట్రపతి బాధ్యతలను చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు.

ఒక ఆదివాసీ గ్రామంలో పుట్టిన తాను రాష్ట్రపతి భవన్ వరకు రావడం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని… దేశంలోని పేద ప్రజలందరికీ దక్కిన విజయమని ద్రౌపది ముర్ము చెప్పారు. ఈ దేశంలో పేదలు కూడా తమ కలలను సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు తన ఎన్నికే ఒక నిదర్శనమని అన్నారు. 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల వేళ తన రాజకీయ జీవితం ప్రారంభమయిందని… 75 ఏళ్ల వేడుకల వేళ దేశ అత్యున్నత పదవికి ఎన్నికయ్యానని… తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.

దేశంలో అందరికీ ప్రాథమిక విద్య అందాలనేది తన ఆకాంక్ష అని ముర్ము తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతిపై దృష్టి సారిస్తానని చెప్పారు. యువతను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ… వ్యక్తిగత జీవితంలో ఎదుగుతూ, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. యువతకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు.

2015లో ఝార్ఖండ్ గవర్నర్ గా ద్రౌపది ముర్ము పని చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆమె రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ కేబినెట్ లో ఆమె రాష్ట్ర మంత్రిగా పని చేశారు. అప్పట్లో బీజేపీ మద్దతుతో బీజేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సాధారణ క్లర్క్ గా జీవితాన్ని ప్రారంభించిన ముర్ము… అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించడం అందరికీ గర్వకారణం.

Related posts

కర్ణాటక ఎన్నికలకు మోగిన నగారా…మే 10 ఎన్నికలు 13 ఓట్ల లెక్కింపు ..!

Drukpadam

ఊపిరితీస్తున్న ‘వాయు కాలుష్యం’!

Drukpadam

ఏపీలో ఒకేసారి 15 .60 లక్షల ఇళ్ల భారీ పథకాన్నిప్రారంభించనున్న సీఎం జగన్…

Drukpadam

Leave a Comment