ముగ్గురు టీఆర్ఎస్ ఎంపీలు సహా 19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు!
-నిరసనల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
-నిన్న లోక్ సభలో నలుగరు కాంగ్రెస్ సభ్యులపై వేటు
-నేడు రాజ్యసభలో విపక్షాల నిరసనలు
-సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారంటూ వేటు
ధరల పెరుగుదల,పెదమధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే నిత్యావసర వస్తువులపై జిఎస్టి వసూల్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ వర్షాకాలసమావేశాలు అట్టుడుకుతున్నాయి. ప్రతిపక్షాలు ధరవరులపై ప్రజలపై పడుతున్న భావరాలపై చర్చించాలని పట్టుపడితే పట్టించుకోని కేంద్రం అడుగుతున్న సభ్యులను సభనుంచి గెంటి వేస్తుందని సస్పెండ్ కు గురైన సభ్యులు మండిపడుతున్నారు .
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాల నిరసనల పర్వం కొనసాగుతోంది. నిన్న లోక్ సభ నుంచి నలుగురు కాంగ్రెస్ సభ్యులు సస్పెన్షన్ కు గురికాగా, నేడు 19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారని, బిగ్గరగా నినాదాలు చేస్తున్నారని వారిపై ఈ వారాంతం వరకు వేటు వేశారు. సస్పెండైన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు లింగయ్య యాదవ్, రవీంద్ర వద్దిరాజు, దీవకొండ దామోదర్ రావు కూడా ఉన్నారు.
సస్పెండైన ఇతర ఎంపీలు వీరే…
సుస్మితా దేవ్- తృణమూల్
డాక్టర్ శంతను సేన్- తృణమూల్
మౌసమ్ నూర్- తృణమూల్
శాంతా చెత్రి- తృణమూల్
డోలా సేన్- తృణమూల్
అభిర్ రంజన్ దాస్- తృణమూల్
నదిముల్ హక్- తృణమూల్
కనిమొళి- డీఎంకే
హమీద్ అబ్దుల్లా- డీఎంకే
గిర్ రంజన్- డీఎంకే
ఎన్నార్ ఎలాంగో- డీఎంకే
ఎస్. కల్యాణసుందరమ్- డీఎంకే
ఎం.షణ్ముగం- డీఎంకే
ఏ.ఏ. రహీమ్- సీపీఎం
డాక్టర్ వి.శివదాసన్- సీపీఎం
పి.సంతోష్ కుమార్- సీపీఐ
సస్పెన్షన్ ఉత్తర్వులను చించివేస్తూ బహిష్కరణకు గురైన ఎంపీల నిరసన…
- ఎల్పీజీ ధరల పెంపు, నిత్యావసరాలపై చర్చ జరగాల్సిందేనని డిమాండ్
- పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ఎంపీల నిరసన
- లోక్ సభ నుంచి సస్పెండైన మాణిక్కం ఠాగూర్, రమ్య హరిదాస్, జ్యోతి మణి, టీఎన్ ప్రతాపన్
లోక్ సభలో సభా నిబంధనావళిని అతిక్రమిస్తూ పోడియం ముందు నిరసనకు దిగారన్న కారణంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల నుంచి బహిష్కరణకు గురైన నలుగురు కాంగ్రెస్ ఎంపీలు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. సోమవారం సభ నుంచి సస్పెండ్ అయిన వెంటనే పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగిన ఎంపీలు… మంగళవారం గాంధీ విగ్రహం ముందు కూర్చుని నిరసనను కొనసాగించారు.
ఈ సందర్భంగా తమను పార్లమెంటు వర్షాకాల సమావేశాల నుంచి బహిష్కరిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను చించి వేస్తూ వారు తమ నిరసనను కొనసాగించారు. సోమవారం నాటి సమావేశాల్లో గ్యాస్ ధరల పెంపు, నిత్యావసరాలపై జీఎస్టీ విధింపుపై కాంగ్రెస్ పార్టీ చర్చకు పట్టుబట్టింది. ఈ సందర్భంగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు మాణిక్కం ఠాగూర్, జ్యోతిమణి, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్‌లు ప్లకార్డులు చేతబట్టి వెల్‌లోకి దూసుకువెళ్లారు.
పోడియాన్ని చుట్టుముట్టడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని స్పీకర్ ఎంతగా చెప్పినా వారు వినిపించుకోలేదు. ఈ క్రమంలో నలుగురు ఎంపీలను పార్లమెంటు వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం నాటి నిరసనలోనూ ఎల్పీజీ ధరల పెంపు, నిత్యావసరాలపై జీఎస్టీ విధింపుపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని, పార్లమెంటే ఈ సమస్యలపై చర్చా వేదిక అని కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు.