ఫలించిన IJU కృషి…
TUWJ హర్షం
రైలు ప్రయాణంలో జర్నలిస్టులకు రాయితీని రైల్వే బోర్డు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణించిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(IJU) జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే. శ్రీనివాస్ రెడ్డి, బల్విందర్ సింగ్ లు రైల్వే బోర్డు ఉన్నతాధికారులతో పాటు కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరిపి రైలు ప్రయాణాల్లో జర్నలిస్టులకు రాయితీని కొనసాగించాలని వినతి పత్రాలు సమర్పించారు. అలాగే ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అంతేకాకుండా మే 10న, దేశ వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో జర్నలిస్టులకు రైల్వే పాస్ లను జారీ చేయాలని ఐజేయూ డిమాండ్ చేసింది. ఐజేయూ డిమాండ్ పై పునరాలోచించిన రైల్వే బోర్డు ఎట్టకేలకు సీనియర్ సిటిజెన్స్ తో పాటు జర్నలిస్టులకు రాయితీని కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో రైల్వే శాఖ అధికారులకు ఉన్నతాధికారుల నుండి సంకేతాలు రావడంతో రైల్వే పాస్ ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. జర్నలిస్టులు తమ సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లలో పాస్ లను పొందగలరు. రైలులో రాయితీ కోసం పట్టువీడకుండా ప్రయత్నం చేసిన ఐజేయూ నాయకత్వానికి, ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రులకు, రైల్వే బోర్డు అధికారులకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) పక్షానా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు అద్యక్షులు నగునూరి శేఖర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ తెలిపారు.