వేలంలో రూ.28 లక్షలకు అమ్ముడుపోయిన యాపిల్ ఫోన్!
- 2007 నాటి మొదటి తరం యాపిల్ ఐఫోన్ కు మంచి ధర
- యాపిల్ మొదటి తరం ఐపాడ్ కు రూ.20 లక్షలు
- ఆర్ఆర్ వేలంలో యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుకు పోటీ
యాపిల్ సెప్టెంబర్ 7న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది. దీనికంటే ముందు యాపిల్ కు సంబంధించిన ఓ ఫోన్ భారీ ధర పలికి ప్రీమియం ఫోన్ కు ఉన్న క్రేజీ ఏ పాటిదో తెలియచెప్పింది. ఐఫోన్ మొదటి తరం ఫోన్, 2007 నాటి మోడల్ ను ఒక దాన్ని ఇటీవలే అమెరికాలో వేలం వేశారు. 35,000 డాలర్లకు ఒకరు దీన్ని సొంతం చేసుకున్నారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.28 లక్షలు. ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ యాపిల్ కు చెందిన 70 ఉత్పత్తులను వేలానికి పెట్టింది.
2007 నాటి 8 జీబీ మోడల్ ఐఫోన్ 35,414 డాలర్లు పలికింది. యాపిల్ నాటి సీఈవో స్టీవ్ జాబ్స్ 2007 జనవరి 9న ఈ ఫోన్ ను శాన్ ఫ్రాన్సిస్కోలోని మ్యాక్ వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఆవిష్కరించారు. నాడు ఈ ఫోన్ ధర 599 డాలర్లు ఉండేది. ఇక ఈ వేలంలో యాపిల్-1 సర్క్యూట్ బోర్డ్ 5.41 కోట్లు పలికింది. యాపిల్ మొదటి తరం ఐపాడ్ రూ.20 లక్షలకు అమ్ముడుపోయింది.