కాంగ్రెస్ కు బిగ్ షాక్.. పార్టీకి గులాం నబీ అజాద్ రాజీనామా
- పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకు రాజీనామా
- సోనియాకు రాజీనామా లేఖను పంపించిన అజాద్
- రాహుల్ గాంధీకి మెచ్యూరిటీ లేదని విమర్శ
కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ అజాద్ షాకిచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. 1970లలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని… అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కోసమే పని చేశానని తన రాజీనామా లేఖలో తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ మారడం లేదని చెప్పారు.
పార్టీ ఇప్పటికీ రిమోట్ కంట్రోల్ మోడల్ తో పని చేస్తోందని విమర్శించారు. పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతున్నా… సరైన చర్యలు తీసుకోవడం లేదని అజాద్ అన్నారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుండా చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి మెచ్యూరిటీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని 2020లో సోనియాగాంధీకి లేఖ రాసిన జీ23 గ్రూపు నేతల్లో అజాద్ కూడా ఒకరు.
పార్టీలో కీలక నిర్ణయాలన్నీ రాహుల్ సెక్యూరిటీ గార్డులు, వ్యక్తిగత సహాయకులే తీసుకుంటున్నారు: గులాం నబీ అజాద్
- రాజీనామా లేఖలో రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేసిన అజాద్
- మీడియా ముందు ప్రభుత్వ ఆర్డినెన్స్ చించివేయడం రాహుల్ అపరిపక్వతకు నిదర్శనమని వ్యాఖ్య
- 2014 ఎన్నికల్లో ఓటమికి ఆయనే బాధ్యుడని విమర్శ
పార్టీ సంప్రదింపుల యంత్రాంగాన్ని కూల్చివేస్తూ రాహుల్ గాంధీని 2013లో ఉపాధ్యక్షుడిగా నియమించారని ఆయన ఆరోపించారు. ‘అనుభవం ఉన్న నాయకులందరినీ పక్కనబెట్టారు. అనుభవం లేని, వ్యక్తి పూజ చేసేవాళ్లు ఓ కోటరీగా ఏర్పాటై పార్టీ వ్యవహారాలను నడపడం ప్రారంభింంచారు’ అని ఆజాద్ దుయ్యబట్టారు.
రాజీనామా లేఖలో రాహుల్ గాంధీ గురించి ఆయన మరిన్ని ఘాటు వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీది చిన్న పిల్లల ప్రవర్తన అని ఆరోపించారు. ‘ఈ అపరిపక్వతకు అత్యంత స్పష్టమైన ఉదాహరణ ఏమిటంటే.. మీడియా ముందు ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను చింపివేయడం. ఈ ఆర్డినెన్స్ కాంగ్రెస్ కోర్ గ్రూప్ మార్గనిర్దేశంలో తయారైంది. ఆ తర్వాత ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. కానీ రాహుల్ తన కుర్ర చేష్టలతో ప్రధానమంత్రి, భారత ప్రభుత్వ అధికారాన్నే ప్రశ్నించారు’ అని అజాద్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ లో సంప్రదింపుల ప్రక్రియను రాహుల్ కూల్చివేశారని గులాం నబీ ఆరోపించారు. ‘దురదృష్టవశాత్తూ, రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత, ముఖ్యంగా 2013 జనవరిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమించబడిన తర్వాత, అంతకుముందు ఉన్న మొత్తం సంప్రదింపుల యంత్రాంగాన్ని కూల్చివేశారు’ అని లేఖలో పేర్కొన్నారు. ఇక, 2014 ఎన్నికల ప్రచారం ముగింపు దశలో రాహుల్ చర్యలు పార్టీ ఓటమికి దారితీశాయన్నారు.
పార్టీ క్లిష్టసమయంలో ఉన్నప్పుడు రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడాన్ని అజాద్ తప్పుబట్టారు. ‘2019 ఎన్నికల నుంచి పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. ఈ సమయంలో రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షుడి ఎంపిక కోసం జరిగిన వర్కింగ్ కమిటీ మీటింగ్ లో పార్టీ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సీనియర్ కార్యకర్తలందరినీ అవమానించారు. ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గత మూడు సంవత్సరాలుగా మీరు ఆ పదవిలో ఈ రోజు కూడా కొనసాగుతున్నారు’ అని రాహుల్ ను ఉద్దేశిస్తూ ఆయన పేర్కొన్నారు.
గులాంనబీ రాజీనామా లేఖ పూర్తీ పాఠం ఆంగ్లంలో