Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బెంగాల్ లో టీఎంసీ పై మంత్రి శ్రీకాంత్ మహతా అనుచిత వ్యాఖ్యలు…

బెంగాల్ లో టీఎంసీ పై మంత్రి శ్రీకాంత్ మహతా అనుచిత వ్యాఖ్యలు…
-సొంత ఎమ్మెల్యేలు, ఎంపీలపైనే వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రికి షోకాజ్ నోటీసు ఇచ్చిన టీఎంసీ
-నిజాయతీతో పనిచేస్తున్న కార్యకర్తలను అగ్రనాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన
-పార్టీ దోపిడీదారుల మాటలు మాత్రమే వింటోందన్న మంత్రి
-ఇవన్నీ చూస్తూ ఉండడం కంటే మన దారి మనం వెతుక్కోవడం బెటరని వ్యాఖ్య
-ఆయన నిజమే చెప్పారన్న బీజేపీ

సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను దోపిడీదారులగా అభివర్ణించిన పశ్చిమ బెంగాల్ మంత్రి శ్రీకాంత మహతపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) చర్యలకు ఉపక్రమించింది. మిమి చక్రవర్తి, నస్రత్ జహాన్ సహా సినీ పరిశ్రమకు చెందిన పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మంత్రి శ్రీకాంత దోపిడీదారులుగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాషిమ్ మేదినీపూర్ జిల్లాలోని సల్బోని ఎమ్మెల్యే అయిన శ్రీకాంత మహత ఆ వీడియోలో మాట్లాడుతూ.. మిమి చక్రవర్తి, నస్రత్ జహాన్, జూన్ మాలియా, సయోని ఘోష్, సయంతిక బెనర్జీ తదితరులు దోపిడీదారులు (లూటర్స్)గా మారారని ఆరోపించారు. నిజాయతీతో పనిచేస్తున్న కార్యకర్తలను పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ వీడియో వైరల్ కావడంతో పార్టీ స్పందించింది.

పాషిమ్ మేదినీపూర్ టీఎంసీ కో ఆర్డినేటర్ అజిత్ మైటీ మాట్లాడుతూ.. పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన మహతకు షోకాజ్ నోటీసు ఇచ్చినట్టు పేర్కొన్నారు. షోకాజ్ నోటీసుకు మహత స్పందించారని, చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారని అజిత్ తెలిపారు. భావోద్వేగంలో అలా మాట్లాడేశానని వివరణ ఇచ్చారని పేర్కొన్నారు.

కాగా, ఆ వీడియోలో మహత మాట్లాడుతూ.. అభిషేక్ బెనర్జీ, సుబ్రత బక్షి వంటి వాళ్లు చెడ్డవాళ్లను మంచి వాళ్లుగా గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటప్పుడు తామెలా నెగ్గుకొస్తామని ప్రశ్నించారు. చెడ్డవాళ్లను చెడ్డవాళ్లనే చెప్పాలని అన్నారు. మహదేవ్ మొదలుకొని సంధ్యారాయ్, జూన్ మాలియా, సయాని, సయంతిక, మిమీ, నుస్రత్ వంటి వాళ్లు పార్టీకి ఆస్తులుగా మారితే తాము పార్టీలో ఉండలేమని తేల్చిచెప్పారు. వారు కనుక డబ్బులు దోచుకుంటే జైలుకు వెళ్లడం మంచిదని, లేదంటే ప్రజలు మనందరినీ దొంగలుగా ముద్ర వేస్తారని, మనందరం ఇలాంటి వెక్కిరింపులు ఎదుర్కోవాల్సిందేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, స్కూల్ జాబ్స్ కుంభకోణం కేసులో సీనియర్ నాయకులు పార్థ ఛటర్జీ, పశువుల అక్రమ రవాణా కేసులో అనుబ్రత మొండల్‌ ఇప్పటికే అరెస్టైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘పార్టీ కేవలం దొంగల మాటలు మాత్రమే వింటుంటే కోల్‌కతా లాంటి నగరాల్లో వారు విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడుతుంటే మనం చూస్తూ మౌనంగా ఎలా ఉండగలం? మన తోవ మనం వెతుక్కోవాలి. లేదంటే అన్నింటినీ విడిచిపెట్టి ఆశ్రమానికి వెళ్లిపోవాలి’’ అని మహత అన్నారు.

ఆయన ఆరోపణలపై స్పందించిన టీఎంసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. మహత వ్యాఖ్యలను కొట్టిపడేశారు. శ్రీకాంత ఏమైనా చెప్పాలనుకుంటే పార్టీ క్రమశిక్షణకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆయన ముందుకు వెళ్లకూడదని అన్నారు. శ్రీకాంత ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. మహత నిజమే చెప్పారని, టీఎంసీ లూటర్స్ పార్టీ అని విమర్శించారు.

Related posts

అచ్చే దిన్ కాదు చచ్చె దిన్…సీఎల్పీ నేత భట్టి

Drukpadam

పీసీసీ పదవి నుంచి రేవంతరెడ్డిని తప్పించనున్నారా …?

Drukpadam

ఏపీకి మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదు: కేంద్రమంత్రి అథవాలే!

Drukpadam

Leave a Comment