కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో నేనేం చేయాలో నిర్ణయించుకున్నా..: రాహుల్ గాంధీ!
-పార్టీ అధ్యక్ష పదవిపై తాను స్పష్టంగానే ఉన్నట్టు వెల్లడించిన రాహుల్
-భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం తమిళనాడులో యాత్ర చేస్తున్న అగ్రనేత
-నవంబర్ 17న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నిక
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగినప్పుడు తాను అధ్యక్షుడిగా ఉంటానా, లేదా అన్న విషయంపై స్పష్టత వస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తానేం చేయాలనుకున్నానో ఇప్పటికే నిర్ణయించుకున్నానని.. ఈ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మీడియా ఆయనను కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతారా అని ప్రశ్నించగా.. ఈ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నవంబర్ 17న ఎన్నిక జరగనుంది. రెండు రోజుల తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా..
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై కొంతకాలంగా తీవ్ర గందరగోళం కొనసాగుతోంది. పార్టీలో ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను పూర్తిగా అధ్యక్ష పదవికి దూరం కాలేదన్న దిశగా రాహుల్ సంకేతాలు ఇచ్చినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుస పరాజయాలు, కీలక నేతల నిష్క్రమణలతో పార్టీలో నిరుత్సాహం నెలకొన్న వేళ రాహుల్ వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ లో ఉత్సాహం నింపేందుకు..
కాంగ్రెస్ లో నూతన జవసత్వాలు నింపేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమిళనాడులోని కన్యాకుమారిలో పాదయాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ జమ్మూకాశ్మీర్ వరకు కొనసాగించనున్నారు.