Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూత…తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం…!

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు
  • ఈ తెల్లవారుజామున 3.25 గంటలకు కన్నుమూత
  • రేపు అంత్యక్రియలు
  • 1966లో ‘చిలకా గోరింక’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. 

కృష్ణంరాజు 20 జనవరి 1940లో జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టారు. 1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ ఆయన తొలి సినిమా. హీరోగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ విలన్‌గానూ నటించారు. ‘అవే కళ్లు’ సినిమాలో విలన్‌గా చేశారు. 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో వచ్చిన ‘తాండ్ర పాపారాయుడు’ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 

2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న వంటి సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఐదున్నర దశాబ్దాల కెరియర్‌లో బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, పెళ్లి కూతురు, మహ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, నీతి నియమాలు, తల్లీకొడుకులు, రారాజు, త్రిశూలం, రంగూన్ రౌడీ, మన ఊరి పాండవులు, కటకటాల రుద్రయ్య, సతీసావిత్రి, పల్నాటి పౌరుషం, తాతామనవడు, టూటౌన్ రౌడీ తదితర 187 సినిమాల్లో నటించారు. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లోనూ సత్తా చాటారు. గోపీకృష్ణ మూవీస్ పతాకం పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ కృష్ణంరాజు ప్రవేశించారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అదే ఏడాది నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం నుంచి ఎంపీగా విజయం సాధించారు. వాజ్‌పేయి హయాంలో మంత్రిగానూ పనిచేశారు. కృష్ణంరాజు నటవారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణం రాజు అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 

కృష్ణంరాజు అంత గొప్ప స్టార్ గా వెలిగిపోవడానికి, పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి వెనుక ప్రముఖ నిర్మాత ఎల్వీ ప్రసాద్ చేసిన సూచన గురించి తెలుసుకోవాలి. నిజానికి తన తొలి చిత్రం ‘చిలకా గోరింక’ సినిమా తర్వాత సినీ పరిశ్రమ నుంచి కృష్ణంరాజు వెళ్లిపోవాలని అనుకున్నారు. ఎందుకంటే ఆ సినిమా అనుకున్న మేర సక్సెస్ ఇవ్వలేదు. ఈ బాధతోనే ఆయన తనకు సినిమాలు అచ్చి రావేమో అనుకున్నారు. 

అదే సమయంలో ‘నేనంటే నేనే’ సినిమాలో అవకాశం రాగా, పాత్ర నచ్చక అంగీకరించలేదు. సరిగ్గా అప్పుడే నిర్మాత ఎల్వీ ప్రసాద్ ను కలుసుకోవాల్సి వచ్చింది. ‘‘నీవు చేసిన పాత్ర ఎలాంటిది అన్నది కాదు. ఆ పాత్ర ద్వారా ప్రజలకు చేరువ అయ్యావా? ఇచ్చిన పాత్రకు న్యాయం చేశావా? అన్నదే నటుడిగా నీవు చూడాల్సింది’’అని ఎల్వీ ప్రసాద్ చెప్పారట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో కృష్ణంరాజు స్వయంగా వెల్లడించారు. 

ఎల్వీ ప్రసాద్ చెప్పిన మాటలు ధైర్యాన్ని ఇవ్వడంతో కృష్ణంరాజు ‘నేనంటే నేనే’ సినిమా చేశారు. అది విజయవంతం కావడంతో ఆయనలో నమ్మకం పెరిగింది. అప్పుడు భిన్నమైన పాత్రలతో అవకాశాలు తలుపుతట్టాయి. దీంతో అసలు తాను పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఎల్వీ ప్రసాదే కారణమని కృష్ణంరాజు గతంలో చెప్పారు. 

కేసీఆర్ సంతాపం

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా పాలనారంగం ద్వారా ప్రజలకు సేవలు అందించిన ఆయన మృతి విచారకరమని పేర్కొన్నారు. కృష్ణంరాజు తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో విలక్షణ నటనాశైలితో రెబల్ స్టార్‌గా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. 

వెంకయ్యనాయుడు నివాళి 

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఆయనకు ఘన నివాళి అర్పించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు  పరమపదించడం అత్యంత విచారకరమని వెంకయ్య ట్వీట్ చేశారు. మంచి తనానికి మారు పేరుగా అనేక మంది అభిమానాన్ని చూరగొన్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. ఏపీ సీఎం జగన్ ,చంద్రబాబు ,చిరంజీవి , ఇతర రాజకీయ ప్రముఖులు , సీనీరంగా ప్రముఖులు సంతాపం తెలిపారు 

Related posts

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు!

Drukpadam

జర్నలిస్టుల కష్టాలు తెలుసు అందుకే ప్రత్యేక యాప్ :సి జె ఐ ఎన్ వి రమణ…

Drukpadam

ఏపీ లో మంత్రి వ్యాఖ్యలపై దుమారం…

Drukpadam

Leave a Comment