టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్…
-జలుబుతో వైద్య పరీక్షలు చేయించుకున్నానన్న కవిత
-పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందని వెల్లడి
-తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని పిలుపు
-కేటీఆర్ కు రెండు సార్లు కరోనా
కరోనా మహమ్మారి ఇంకా పోలేదు అనేక దేశాల్లో కరోనా ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. మనదేశంలో కూడా కరోనా కేసుల సంఖ్యా బాగా తగ్గింది .ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యా వంద నుంచి రెండు వందల లోపు మాత్రమే ఉంటుంది. ప్రజలు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని తమ దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు .గతంలో ప్రభుత్వం కూడా ఉద్యోగులను ఆఫీస్ లకు రావద్దని చెప్పింది. ఐటీ కంపెనీలు ఇప్పటికి తమ ఉద్యోగులచేత ఇంటినుంచి పని చేయించుకుంటున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో హైద్రాబాద్ లాంటి మహానగరాలకు వివిధ రాష్ట్రాలు దేశాల నుంచు లక్షలమంది వచ్చి వెళుతుంటారు . అయినప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల కరోనా బాగా తగ్గింది. అయితే ఇప్పటికి ప్రతిరోజూ కొన్ని కేసులు వస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ , ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లాంటి ప్రముఖులకు కరోనా వచ్చిన విషయం తెలిసిందే . ఇప్పుడు వారి కుటుంబంలోనే ఎమ్మెల్సీ కవితకు కరోనా వచ్చినట్లు ఆమె స్వయంగా వెల్లడించారు .
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆమె తన సోషల్ మీడియా వేదికల మీద ఈ విషయాన్ని వెల్లడించారు. స్వల్ప జలుబు లక్షణాలు కనిపించడంతో తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని… ఈ క్రమంలో తనకు కరోనా సోకినట్లు తేలిందని ఆమె వెల్లడించారు.
గడచిన రెండు రోజులుగా తనను కలిసిన వారిలో ఎవరికైనా జ్వరం, జలుబు లక్షణాలు కనిపిస్తే.. తక్షణమే ఐసోలేషన్‌లోకి వెళ్లాలని, కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపించుకోవాలని ఆమె కోరారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో తాను తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ వైద్య చికిత్స తీసుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.