వివాదాస్పందంగా మారిన మూడు రాజధానులు …అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తి
రాజధానులు ఎన్నైనా పెట్టుకోండి.. కేంద్ర మంత్రి నారాయణ స్వామి
3 కాకుంటే 4 లేదా 5 రాజధానులు పెట్టుకోండన్న నారాయణ స్వామి
అమరావతి అభివృద్ధిని మాత్రం ఆపొద్దని వ్యాఖ్య
అమరావతిని ఏపీ రాజధానిగా అందరూ గుర్తించారన్న కేంద్ర మంత్రి
ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ధి, వైసీపీ ప్రతిపాదిస్తున్న 3 రాజధానుల అంశంపై కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి నారాయణ స్వామి బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిని ఏపీ రాజధానిగా అందరూ గుర్తించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమ దూరంలో ఉన్న అమరావతిలో అభివృద్ధి నిలిచిపోరాదని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతితో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలు కూడా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 3 రాజధానుల అంశాన్ని ప్రస్తావించిన నారాయణ స్వామి.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి 3 రాజధానులు.. లేదంటే 4 రాజధానులు, 5 రాజధానులు పెట్టుకున్నా ఇబ్బంది లేదని, అయితే అమరావతి అభివృద్ధి మాత్రం ఆగిపోరాదని ఆయన పేర్కొన్నారు. రాజధాని అంశంపై వెలువడుతున్న వివాదాస్పద వ్యాఖ్యలు అమరావతి అభివృద్ధికి ఆడ్డంకిగా మారుతున్నాయని కూడా ఆయన అన్నారు. అమరావతిని గత ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ భేటీ… అసెంబ్లీలో 15 అంశాలు లేవనెత్తాలని నిర్ణయం
రేపు ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీఎల్పీలో చర్చ
అమరావతిలో అక్రమాలంటూ కేసుల నమోదుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం టీడీపీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది.
శాసన సభా సమావేశాల్లో మొత్తంగా 15 అంశాలను లేవనెత్తాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అమరావతిలో అక్రమాల పేరిట కేసులు నమోదు చేస్తున్న వైనంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని తీర్మానించింది. అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నేపథ్యంలో అమరావతిలో అక్రమాలంటూ సీఐడీ తాజాగా అరెస్ట్‌లకు దిగిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అసలు ఎలాంటి లావాదేవీలే జరగని అంశాలపై కేసులేమిటని టీడీఎల్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు కేసులు పెడుతున్న సీఐడీ అధికారులపై ప్రైవేట్ కేసులు వేసే విషయంపైనా ఈ భేటీలో చర్చ జరిగింది.
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ… ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బుధవారం ఓ కీలక అంశాన్ని ప్రస్తావించింది. వచ్చే ఎన్నికలకు 3 రాజధానుల ప్రతిపాదనతోనే వెళతామని వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు ప్రకటనలు చేసిన అంశాన్ని గుర్తు చేసిన టీడీపీ… 3 రాజధానుల రెఫరెండమ్‌గా అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. 3 ముక్కల రాజధానిపై జగన్‌కు నమ్మకం ఉంటే తక్షణమే అసెంబ్లీని రద్దు చేయాలని టీడీపీ కోరింది. గురువారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇదే డిమాండ్‌ను వినిపించనున్నామని ఆ పార్టీ తెలిపింది.