నా పాట అంటే ఇష్టపడుతున్నారా? లేక నేను బాగుంటానని ఇష్టపడుతున్నారా?: సింగర్ సునీత
- 25 ఏళ్ల కెరియర్ ను పూర్తిచేసిన సునీత
- డబ్బింగ్ కళాకారిణిగాను ఆమెకి మంచి పేరు
- తన టాలెంట్ తనని నిలబెట్టిందంటూ వ్యాఖ్య
తెలుగు పాటకి మరింత తీయదనాన్ని తీసుకుని వచ్చిన గాయనిగా సునీత కనిపిస్తారు. గాయనిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న సునీత, తన స్వర ప్రయాణంలో పాతిక వసంతాలను దాటేశారు. సుకుమారం .. సుమకోమలం అనే పదాలకు అర్థాన్ని చెప్పేదిగా ఆమె వాయిస్ ఉంటుంది. అలాంటి సునీత తాజాగా ‘సుమన్ టీవీ’ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు.
“ఇండస్ట్రీకి వచ్చిన తరువాత చాలామంది చాలా కష్టాలు పడినట్టుగా చెబుతుంటారు. కానీ అలాంటి కష్టాలేవీ నేను పడలేదు. నాకంటూ కొన్ని పరిధులు పెట్టుకున్నాను గనుక నేను అవి దాటి ముందుకు వెళ్లలేదు. బాలీవుడ్ లో ట్రై చేద్దామని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇదే నా ప్రపంచం అనుకుని ఇక్కడే కష్టపడ్డాను. నేను వచ్చిన సమయంలో ఇప్పుడు ఉన్నంత పోటీలేదు. అందువలన సింగిల్ కార్డు పడే అవకాశం దక్కింది” అన్నారు.
ఒక హీరోయిన్ కి ఉన్నంతటి ఫాలోయింగ్ నాకు ఉందని ఎవరైనా అన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నా పాట అంటే ఇష్టపడుతున్నారా? నా చీర అంటే ఇష్టపడుతున్నారా? నేను బాగుంటానని ఇష్టపడుతున్నారా? అనే విషయంలో నాకు కొంత కన్ ఫ్యూజన్ ఉండేది. ఇక నేను డబ్బింగ్ చెప్పే విధానాన్ని అభిమానించినవారు కూడా ఉన్నారు. పాటల పరంగా .. డబ్బింగ్ పరంగా నాకు ఉన్న టాలెంట్ ను నన్ను జనంలోకి తీసుకుని వెళ్లిందనీ .. నేను ఇంతకాలం పాటు నిలదొక్కుకోవడానికి కారణమైందని భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.