మునుగోడు ఉప ఎన్నికకు స్టీరింగ్ కమిటీని ప్రకటించిన బీజేపీ!
- వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన కమిటీ
- కమిటీలో 14 మంది సభ్యులు, ఓ కో ఆర్డినేటర్
- ఎమ్మెల్యేల్లో ఈటలకు మాత్రమే దక్కిన చోటు
నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీజేపీ… ఉప ఎన్నికలకు సంబంధించి ఓ స్టీరింగ్ కమిటీని ప్రకటించింది. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీకి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి కో ఆర్డినేటర్ గా వ్యవహరించనున్నారు. ఇక ఈ కమిటీలో వీరిద్దరితో పాటు మరో 14 మంది సభ్యులు ఉన్నారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి, రవీంద్ర నాయక్, రాపోలు ఆనంద భాస్కర్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, దుగ్యాల ప్రదీప్ కుమార్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కపిలవాయి దిలీప్ కుమార్, ఆచారి, దాసోజు శ్రవణ్ లు కొనసాగనున్నారు. బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా… ఒక్క ఈటల రాజేందర్ కు మాత్రమే ఈ కమిటీలో చోటు దక్కింది.