ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే త్వరలో ప్రారంభం …ఖమ్మం కలెక్టర్ గౌతమ్…
-నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమావేశం
-ఖమ్మం జిల్లాలో 200 కి ,మీ నేషనల్ హైవే పనులు
-ఖమ్మం నుంచి దేవరపల్లి త్వరలో చేపట్టనున్నట్లు వెల్లడి
-పురోగతిలో ఖమ్మం కోదాడ పనులు
-ఖమ్మం టు కురవి రహదారికి భూసేకరణ
జిల్లాలో రహదారుల విస్తరణ పనుల పూర్తికి చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో రహదారుల విస్తరణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 200 కి.మీ. మేర నేషనల్ హైవే లచే రహదారి విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో నాగపూర్ నుండి అమరావతి గ్రీన్ ఫీల్డ్, ఖమ్మం నుండి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్, సూర్యాపేట నుండి ఖమ్మం, కోదాడ నుండి ఖమ్మం, ఖమ్మం నుండి కురవి వరకు రహదారుల విస్తరణ పనులు ఉన్నట్లు ఆయన అన్నారు. ఖమ్మం నుండి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ భూసేకరణ ప్రక్రియ పూర్తయినట్లు, పనులు ప్రారంభించాలని ఆయన అన్నారు. సూర్యాపేట నుండి ఖమ్మం రహదారి విస్తరణ పనులు పూర్తయినట్లు, త్వరలో రవాణాకు అనుమతించనున్నట్లు తెలిపారు. కోదాడ నుండి ఖమ్మం వరకు రహదారి విస్తరణ భూసేకరణ ప్రక్రియ పూర్తయి, పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఖమ్మం నుండి కురవి రహదారి భూసేకరణ నోటిఫికేషన్ స్థాయిలో ఉన్నట్లు, ప్రక్రియ వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. ఖమ్మం నుండి తల్లాడ రహదారిని నాలుగు వరసల రహదారిగా విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. రహదారులు విస్తరణతో ప్రజలకు సౌకర్యం తో పాటు, ప్రమాదాల నియంత్రణ జరుగుతుందని, అభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో నేషనల్ హైవే ప్రాంతీయ అధికారి, హైదరాబాద్ కృష్ణ ప్రసాద్, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, నేషనల్ హైవే పిడి దుర్గాప్రసాద్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, ఎడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రాము, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు.