ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై సీఎం వివరణ సబబుగానే అనిపించింది: లక్ష్మీపార్వతి!
- ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి పేరు మార్పు
- వైఎస్సార్ పేరుపెట్టిన ఏపీ ప్రభుత్వం
- సీఎం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉందన్న లక్ష్మీపార్వతి
- ఆయనను అవమానించినవాళ్లే రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం
విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. హెల్త్ వర్సిటీ పేరు మార్చడంపై తాను స్పందించలేదని ఎన్టీఆర్ హంతకులు భయంకరంగా హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.
నిజమైన ఎన్టీఆర్ అభిమానులు బాధపడితే ఓ అర్థం ఉందని, కానీ ఆయనను అవమానించిన వారే ఈ రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఎన్టీఆర్ పేరును కూడా పలికే అర్హత లేదని స్పష్టం చేశారు. అయినా, హెల్త్ వర్సిటీకి పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో సీఎం అసెంబ్లీలో వివరించారు కదా అని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
“మేం 17 వరకు మెడికల్ కాలేజీలు తీసుకువస్తున్నాం. టీడీపీయేతర ప్రభుత్వాల హయాంలో 14, మా నాన్న గారి హయాంలో 3 మెడికల్ కాలేజీలు వచ్చాయని సీఎం జగన్ చెప్పారు. అంతేకాకుండా ఒక డాక్టర్ గా నాన్న గారు రూపాయికే వైద్యం చేశారు… ఇప్పటికీ ఆయన పేరిట కడపలో ఉచిత ఆసుపత్రి నిర్వహిస్తున్నారు… పేదవాళ్లు సైతం కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకునేలా ఆరోగ్యశ్రీని తీసుకువచ్చారు… ఆరోగ్యరంగంతో ఆయనకున్న అనుబంధం దృష్ట్యానే పేరు మార్చుతున్నామని సీఎం జగన్ వివరించారు.
ఆయన చెప్పిన మాటలు సబబుగానే ఉన్నాయి. ఎన్టీఆర్ పై ద్వేషంతో తీసుకున్న నిర్ణయంలా అనిపించలేదు. త్వరలోనే సీఎం గారిని కలిసి ఏదైనా గొప్ప ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరతాను. ఎన్టీఆర్ కు సంబంధించిన అంశాలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, పేరు పెడదామని సీఎం గారే చెప్పారు. పెద్దాయన (ఎన్టీఆర్) పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, ద్వేషంతోనో, శత్రుభావంతోనే ఏదైనా చేస్తే మనం గర్హించాలని సీఎం అన్నారు” అంటూ లక్ష్మీపార్వతి వివరించారు.
ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు కావాలా? లేక ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు కావాలా? అంటే తాను జిల్లాకు ఎన్టీఆర్ పేరునే కోరుకుంటానని ఆమె వెల్లడించారు. కృష్ణా జిల్లాలో యూనివర్సిటీ అనేది చిన్న విషయం అని, జిల్లాకు ఎన్టీఆర్ పేరుపెట్టడం ద్వారా సీఎం జగన్ ఆయనపై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారని తెలిపారు.