వ్యవసాయ కార్మికుల సమగ్ర సంక్షేమ చట్టం చేయాలి: ఎర్ర శ్రీకాంత్ డిమాండ్
-పేదలకోసం పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఉన్న సంఘం
-తెలంగాణ సాయుధ రైతాంగం పోరాట వారసురాలు
-భూమి భుక్తి,విముక్తి కోసం పోరాటాలు నిర్వహించిన సంఘం
-కూలి రేట్ల పెంపుకోసం సంఘం ఆధ్వరంలో ఉద్యమాలు
-మూడవ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని భారీ కార్మిక ప్రదర్శన
దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని, డిసెంబర్ 5, 6, 7 తేదీలలో ఖమ్మంలో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ మహా కార్మిక ప్రదర్శనను ఖమ్మం 3 టౌన్ లో గ్రేయిన్ మార్కెట్ చుట్టూ నిర్వహించడం జరిగింది.
ప్రదర్శన అనంతరం సిఐటియు జిల్లా నాయకులు భూక్యా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ లో ఎర్ర శ్రీకాంత్ మాట్లాడుతూ దశాబ్దాల పోరాట చరిత్ర కలిగిన వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు ఖమ్మం నగరంలో జరగడం సంతోషదాయకం అన్నారు. దున్నేవానికి భూమి, వెట్టి చాకిరీ రద్దు, ప్రజాస్వామిక వ్యవస్థ కోసం సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసురాలుగా, ప్రపంచ చరిత్రలో లిఖించదగిన పోరాటాలు చేసిన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం అన్నారు. ప్రభుత్వ భూమిని పంచాలని, కనీస వేతన చట్టాల అమలు చేయాలని, సామాజిక సమానత్వం కావాలని, భూస్వామ్య పెత్తందారి దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగించిన పోరాటాలు అనేకం వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించిందన్నారు. దేశంలో మోడీ- బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని, దేశ సంపదను కార్పొరేట్ దోపిడీదారులకు కట్టబెట్టే విధానాలు ముందుకు తెస్తుందన్నారు. ఐక్య పోరాటాల ద్వారా వీటిని తిప్పికొట్టగలిగామన్నారు. ఇదే సందర్భంలో వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం జాతీయస్థాయిలో సమగ్ర సంక్షేమ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మహాసభల జయప్రదంలో కార్మిక వర్గం కీలకపాత్ర పోషిస్తుందని తెలియజేశారు.
రైతు సంఘం జిల్లా నాయకులు బండి రమేష్ మాట్లాడుతూ రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం సంబంధం విడదీయరానిదని ఈ మహాసభలు జయప్రదం లో అన్ని వర్గాలు సహకరిస్తున్నారని భవిష్యత్ పోరాటాలకు వేదికగా మహాసభలు నిర్ణయాలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రదర్శనలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, సిఐటియు నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, బండారు యాకయ్య, తుషాకుల లింగయ్య, వజినేపల్లి శ్రీనివాసరావు, ఎస్ కే సైదులు, నండ్ర ప్రసాద్, గొడవర్తి నాగేశ్వరావు, షేక్ బషీరుద్దీన్, కొమ్ము శ్రీనివాసరావు, పత్తిపాక నాగ సులోచన, శీలం వీరబాబు, వేల్పుల నాగేశ్వరరావు, మద్ది సత్యం, పాశం సత్యనారాయణ, కొట్టే అలివేలు, ఉపేంద్ర, హెచ్ పీరయ్య, బుజ్జి, మీనాల మల్లికార్జున్, మండల వీరస్వామి, చంద్రకాని రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.