గుజరాత్‌లో కేజ్రీవాల్‌కు దక్కేవి రెండు సీట్లేనట: ఏబీపీ న్యూస్-సీఓటర్ సర్వే..తమదే గెలుపు అంటున్న కేజ్రీవాల్ …!
-డిసెంబరులో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
-వరుసగా ఏడోసారి కూడా బీజేపీదే విజయమన్న ఒపీనియన్ పోల్
-ఎన్నికల్లో ఆప్ ప్రభావం ఉంటుందని తేల్చిన వైనం
-కాంగ్రెస్‌కు గరిష్ఠంగా 44 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా
-బీజేపీకి మాత్రం 143 స్థానాలు వస్తాయంటున్న ఒపీనియన్ పోల్
-గుజరాత్ లో ఆప్ దే గెలుపని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెపుతోంది: కేజ్రీవాల్
-తక్కువ మార్జిన్ తో గుజరాత్ లో ఆప్ ప్రభుత్వం వస్తుందన్న కేజ్రీ
-గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయని ఐబీ రిపోర్ట్ లో ఉందని వ్యాఖ్య
-ఆప్ ఓట్లు చీల్చే బాధ్యతను కాంగ్రెస్ కు అప్పగించారని వ్యాఖ్య
ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్‌లో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి ‘ఆప్’ సామ్రాజ్యాన్ని విస్తరించాలని యోచిస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇది చేదు వార్తే. గుజరాత్‌లో ఆప్ ఎంత పోరాడినా దానికి దక్కేది రెండు సీట్లు మాత్రమేనని ఏబీపీ న్యూస్-సీఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. అయితే, గుజరాత్ ఎన్నికల్లో ఆప్ ప్రభావం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై పడుతుందని, గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీలకు తక్కువ ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆప్‌కు మాత్రం 17.4 శాతం వరకు ఓట్లు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఏడోసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకుంటుంది.
గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 99 స్థానాలను కైవసం చేసుకోగా ఈసారి 135 నుంచి 143 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాంగ్రెస్‌కు 36 నుంచి 44 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్న ఒపీనియన్ పోల్.. ఆప్‌కు రెండు స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్ పేర్కొంది. ఇక్కడ మొత్తం 68 స్థానాలు ఉండగా అందులో బీజేపీకి 37 నుంచి 45 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
తమదే గెలుపు అంటున్న కేజ్రీవాల్ …
ఇప్పటికిప్పుడు గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహిస్తే ఆప్ దే విజయమని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ అన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన ఒక రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడిస్తోందని ఆయన తెలిపారు. తక్కువ మార్జిన్ తోనే అయినప్పటికీ గుజరాత్ లో ఆప్ ప్రభుత్వం వస్తుందని ఐబీ రిపోర్ట్ చెపుతోందని అన్నారు.
గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయని, ఈ పార్టీల నేతలు రహస్యంగా సమావేశమవుతున్నారని ఐబీ రిపోర్ట్ లో ఉందని కేజ్రీవాల్ తెలిపారు. గుజరాత్ లో బీజేపీ పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని… బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని బీజేపీ బలోపేతం చేస్తోందని చెప్పారు. ఆప్ కు పడే ఓట్లలో వీలైనంత వరకు చీల్చే బాధ్యతను కాంగ్రెస్ కు అప్పగించారని అన్నారు. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని గుజరాత్ ప్రజలను కోరుతున్నానని చెప్పారు.