పాదయాత్ర పేరుతో దండయాత్రకు వచ్చే వారిని అడ్డుకోవాలి: వైవీ సుబ్బారెడ్డి
- విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన సుబ్బారెడ్డి
- ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే అమరావతి రైతులు వస్తున్నారని వ్యాఖ్య
- అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్ల రూపాయలు కావాలన్న టీటీడీ చైర్మన్
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేపట్టిన అమరావతి టూ అరసవెల్లి మహాపాదయాత్రపై వైసీపీ కీలక నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర పేరిట దండయాత్రకు వచ్చే వారిని అడ్డుకోవాలని ఆయన వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా ఉన్న సుబ్బారెడ్డి గురువారం విశాఖలో పర్యటించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన అడారి ఆనంద్ ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సుబ్బారెడ్డి … ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. పాదయాత్ర పేరుతో దండయాత్రకు వస్తున్న వారిని అడ్డుకోవాలని ఆయన అన్నారు. విశాఖను రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖ అభివృద్ధి ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధిలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్ల రూపాయలు కావాలన్న సుబ్బారెడ్డి… ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదన్నారు.
—————————————————————————————————————–
పథకాలు కావాలంటే జగన్ కు ఓటేయమని అడుగుతాం: వైవీ సుబ్బారెడ్డి
- కొత్తగా ఏ పార్టీ వచ్చినా వైసీపీకి ఇబ్బంది లేదు
- జగన్ సంక్షేమ పథకాలే వైసీపీకి శ్రీరామ రక్ష
- జగన్ ఫొటో పెట్టుకునే జనాల్లోకి వెళ్తాం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని వైసీపీ నేతలు చెపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు. ఏ పార్టీ వచ్చినా వైసీపీకి ఇబ్బంది లేదని… జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీకి శ్రీరామ రక్ష అని అన్నారు. కొత్తగా ఎవరొచ్చినా ఇంత కంటే చేసేది ఏముంటుందని ప్రశ్నించారు.
జగన్ ఫొటో పెట్టుకునే జనాల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతామని… ప్రస్తుతం అమలవుతున్న పథకాలు కొనసాగాలంటే జగన్ కు ఓటేయమని అడుగుతామని చెప్పారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏముందని ప్రశ్నించారు.