అలయ్ బలయ్‌లో చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన గరికపాటి నరసింహారావు
- చిరు కంటే ముందుగానే వచ్చిన గరికపాటి
- గరికపాటి ప్రసంగిస్తుండగా వచ్చిన చిరు
- చిరుతో ఫొటోలకు పోటీ పడ్డ జనం
- ఫొటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతానన్న గరికపాటి
- అనంతరం సరదాగా మాట్లాడుకున్న ఇద్దరు ప్రముఖులు
దసరా వేడుకల్లో భాగంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె, బీజేపీ నేత విజయలక్ష్మి గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అలయ్ బలయ్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు చిరంజీవితో పాటు రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీరిలో ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కూడా ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా చిరంజీవిపై గరికపాటి అసహనం వ్యక్తం చేశారు.
చిరంజీవి కంటే ముందుగానే ఈ కార్యక్రమానికి వచ్చిన గరికపాటి ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవి అక్కడికి వచ్చారు. దీంతో చిరుతో సెల్ఫీలకు అక్కడున్న వారు ఎగబడ్డారు. ఈ సన్నివేశాన్ని చూసిన గరికపాటి… చిరంజీవి పట్ల అసహనానికి గురయ్యారు. ఫొటో సెషన్ ఆపకపోతే…కార్యక్రమం నుంచి వెళ్లిపోతాను అంటూ గరికపాటి అన్నారు. ఈ మాట విన్నంతనే చిరంజీవి అక్కడి నుంచి వచ్చి తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. ఆ తర్వాత గరికపాటి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
అనంతరం గరికపాటి వద్దకు వెళ్లిన చిరంజీవి.. ఫొటో సెషన్‌పై వివరణ ఇచ్చారు. గరికపాటి ప్రవచనాలంటే తనకూ ఇష్టమేనని తెలిపారు. అంతేకాకుండా గరికపాటిని పొగడ్తలతో ముంచెత్తిన చిరంజీవి… భవిష్యత్తులో అవకాశం ఉంటే మిమ్మల్ని మాఇంటికి ఆహ్వానించుకుంటాను అని గరికపాటితో అన్నారు. దీంతో గరికపాటి కూడా ఆ ఘటనను పక్కనపెట్టేసి చిరుతో మాటలు సాగించారు.