మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ మాజీ సీఐ నాగేశ్వరరావు డిస్మిస్!
-మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ మాజీ సీఐ నాగేశ్వరరావు
-అరెస్ట్ చేసి సస్పెండ్ చేసిన పోలీసులు
-ఇటీవలే కండీషనల్ బెయిల్‌పై విడుదల
-ప్రభుత్వ ఆమోదంతో నాగేశ్వరరావుపై వేటు
-విధుల నుంచి తప్పిస్తూ సీవీ ఆనంద్ ఆదేశాలు
విధి నిర్వహణలో ఉంటూనే ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన మారేడుపల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుపై వేటు పడింది. ఆయనను విధుల నుంచి తొలగించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆయనను డిస్మిస్ చేశారు.
వనస్థలిపురం పరిధిలో గతంలో నాగేశ్వరరావు ఓ మహిళను కిడ్నాప్ చేసి… ఆపై తన సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ మేరకు నాగేశ్వరరావుపై కిడ్నాప్‌తో పాటు అత్యాచారం నేరాల కింద వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
ఈ కేసులో గతంలోనే నాగేశ్వరరావును సస్పెండ్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కొంతకాలం పాటు జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న నాగేశ్వరరావు ఇటీవలే కండీషనల్ బెయిల్‌తో విడుదలయ్యారు. నాగేశ్వరరావు తీవ్ర నేరాలకు పాల్పడిన నేపథ్యంలో ఆయనను సర్వీస్ నుంచి తొలగించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో నాగేశ్వరరావును సర్వీసు నుంచి పూర్తిగా తొలగిస్తూ సీవీ ఆనంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.