ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ కస్టడీకి అభిషేక్ రావు!
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ
- తన ఖాతాలోకి వచ్చిన నిధులపై అభిషేక్ వివరాలు చెప్పడం లేదన్న సీబీఐ
- 3 రోజుల పాటు అభిషేక్‌ను సీబీఐ కస్టడీకి అనుమతించిన కోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ బోయినపల్లిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అభిషేక్‌ను సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అభిషేక్‌ను తమ కస్టడీకీ అప్పగించాలన్న సీబీఐ అధికారుల పిటిషన్‌ను విచారించిన కోర్టు… అభిషేక్‌ను 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విచారణలో భాగంగా… అభిషేక్ ఖాతాలోకి రూ.3.5 కోట్ల మేర నిధులు వచ్చాయని గుర్తించామన్న సీబీఐ అధికారులు… ఆ నిధులను అభిషేక్ వివిధ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారని ఆరోపించారు. ఆ నిధులు ఎక్కడి నుంచి అందాయన్న విషయంపై ఆరా తీయగా… దానిపై అభిషేక్ సరైన సమాధానం ఇవ్వలేదని కోర్టుకు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అభిషేక్ నుంచి పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉందని సీబీఐ అధికారులు కోర్తుకు తెలిపారు. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు… అభిషేక్‌ను సీబీఐ కస్టడీకి అనుమతించింది.