Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

230 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి కంటెయినర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం!

230 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి కంటెయినర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం!

  • కొత్తగా కొన్న బీఎండబ్ల్యూ కారులో ఢిల్లీకి పయనం
  • 300 కిలోమీటర్ల వేగంతో పోనివ్వాలని ప్రోత్సహించిన మిత్రుడు
  • ఫేస్‌బుక్ లైవ్‌లో కారు వేగం రికార్డు
  • 230 కిలోమీటర్ల వేగం దాటాక స్పీడ్ తగ్గించిన వైద్యుడు
  • బ్రేకులెయ్యవద్దంటూ ఉత్సాహపరిచిన మిత్రులు
  • వేగం పెంచిన క్షణాల్లోనే ప్రమాదం

వారందరూ స్నేహితులు. ఒకరు బీహార్‌లోని వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆనంద్ ప్రకాశ్ (35), మరొకరు రియల్టర్ అఖిలేశ్ సింగ్ (35), ఇంకొకరు ఇంజినీర్ దీపక్ కుమార్ (37), మరొకరు వ్యాపారవేత్త భోలా కుశ్వాహ(37). డాక్టర్ ఆనంద్ ప్రకాశ్ ఇటీవల సెకండ్ హ్యాండ్ బీఎండబ్ల్యూ కారు కొన్నాడు. ఆ కారులో నలుగురూ కలిసి నిన్న సుల్తాన్‌పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు.

ఆనంద్ కారును డ్రైవ్ చేస్తున్నాడు. బీఎండబ్ల్యూ కారు అవలీలగా 300 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని, ఇలా నెమ్మదిగా వెళ్లడం ఏమీ బాగోలేదంటూ ఓ మిత్రుడు ఆనంద్‌ను రెచ్చగొట్టాడు. 300 కిలోమీటర్ల వేగంతో కారును పోనివ్వాలని ప్రోత్సహిస్తూ వేగాన్ని రికార్డు చేసేందుకు ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేశాడు. ‘అంత వేగంతో వెళ్తే అందరం చస్తాం’ అని ఆనంద్ హెచ్చరించాడు. అలా చెబుతూనే యాక్సలరేటర్‌ను నొక్కి పట్టాడు. కారు వేగం 230 కిలోమీటర్లు దాటింది.

మరోపక్క, ఫేస్‌బుక్‌ లైవ్‌లో కొందరు వారి ప్రయాణాన్ని లైవ్‌లో వీక్షిస్తున్నారు. ఆనంద్ ఆ తర్వాత కారు వేగాన్ని తగ్గించాడు. గమనించిన మరో మిత్రుడు బ్రేకులెయ్యొద్దు. ‘ఆరామ్ సే’ అంటూ ప్రోత్సహించాడు. దీంతో కారు వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించుకున్న ఆనంద్.. అందరూ సీటు బెల్టులు పెట్టుకోవాలని, రహదారి తిన్నగా ఉన్న చోట వేగం పెంచుతానని చెప్పాడు.

అనుకున్నట్టే కారు వేగం పెరిగింది. కొన్ని క్షణాలు గడిచాయి. అంతే పెద్ద శబ్దం వచ్చింది. వేగంగా దూసుకెళ్లిన కారు కంటెయినర్‌ను ఢీకొట్టి నుజ్జనుజ్జు అయింది. కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కారు తుక్కుతుక్కుగా మారింది. ప్రమాదం తర్వాత కారు ఆకారం కనిపించనంతగా తుక్కు అయిదంటే అది ఎంత వేగంతో దూసుకెళ్లిందో ఊహించుకోవచ్చు. ఈ భీకర యాక్సిడెంట్ ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగింది. ఈ ఘటనకు ముందు జరిగిన వారి సంభాషణ మొత్తం ఫేస్‌బుక్‌ లైవ్‌లో రికార్డయింది.

Related posts

ఇంజెక్షన్ గుచ్చి చంపడం వెనుక ఇంతకథ ఉంది …

Drukpadam

సీలేరు నది విషాదం పడవలు బోల్తా 8 మంది వలస కూలీల గల్లంతు…

Drukpadam

కారుపై పొరపాటున పడిన ఉమ్ము.. బెల్టుతో చితకబాది వీరంగం!

Drukpadam

Leave a Comment