సీట్లు మాత్రం లేవు ..పోటీలో ఉంటామంటున్నసీనియర్లు!
–ఖమ్మం జిల్లాలో విచిత్ర వైఖరి … అధికార పార్టీలో లొల్లి
–విపక్షాలతో పొత్తు ఉంటుందని అధినేత సంకేతాలు
–ఎవరు ఎటు ఎక్కడ అనేదానిపై మల్లగుల్లాలు
–ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కేసీఆర్ కు సన్నగిల్లిన ఆశలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఆశలు సన్నగిల్లిన కేసీఆర్ తమ కత్తులే తమను పొడిచాయని గత ఎన్నికల సందర్భంగా అన్న మాటలు ఇప్పటికి చెవుల్లో గింగురుమంటున్నాయి….అయినా ఇక్కడ నాయకుల్లో మార్పు లేదు…ఎవరి దారి వారిదిగానే ఉంది. …ఇప్పటికే గత ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీల నుంచి గెలిచి అధికార టీఆర్ యస్ లోకి జంప్ అయిన సభ్యులు ఉండగా, వారు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలనుంచి తమకే సీట్లు వస్తాయని గంపెడు ఆశతో ఉన్నారు . అందుకు కారణం లేకపోలేదు …సిట్టింగ్ లందరికి సీట్లు ఇస్తామని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ సమావేశంలో చెప్పారు .
అయితే 2018 లో టీఆర్ యస్ అభ్యర్థులుగా పోటీచేసి ఓటమిపాలై తిరిగి 2023 ఎన్నికలకు ఆశలు పెట్టుకున్న వారు ఉన్నారు . వారు కూడా వచ్చే ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని గంటాపథంగా చెబుతున్నారు. మీరెట్లా పోటీచేస్తారని అంటే మా లెక్కలు మాకున్నాయని అంటున్నారు . దీంతో పార్టీ మారి అధికార పార్టీలోకి వచ్చినవారికి కొన్ని అనుమానాలు లేకపోలేదు . ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనరల్ సీట్లు కేవలం మూడే… వాటిపై ఆశలు పెట్టుకున్నవారిసంఖ్య చాంతాడంత ఉంది. ఎవరిని ఎలా బుజ్జగించాలనే పని పార్టీ అధినేత కేసీఆర్ తన తనయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు అప్పగించినట్లు ఉన్నారు . అందువల్ల ఆయన సమ్మతి ,అసమ్మతి నేతలతో టచ్ లో ఉన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు , భద్రాద్రి కొత్తగూడెం లోని జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మాత్రమే జనరల్ స్థానాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది.ఖమ్మం మాత్రమే టీఆర్ యస్ ఖాతాలోకి వెళ్ళింది. తర్వాత పాలేరు ,కొత్తగూడెం శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి , వనమా వెంకటేశ్వరరావు లుకూడా కాంగ్రెస్ కు బై చెప్పి అధికార పార్టీకి జైకొట్టారు . రాష్ట్రంలో పారుతున్న రాజకీయ పరిస్థితులవల్ల వామపక్షాలతో గులాబీ పార్టీ పొత్తు ఉంటుందనే అభిప్రాయాలూ ఉన్నాయి. దానివల్ల మూడు జనరల్ స్థానాల్లో రెండు వారు అడుగుతున్నారు . ఇప్పటికి గులాబీ బాస్ కేసీఆర్ లెఫ్ట్ పార్టీ లు ఒక అవగాహనకు వచ్చాయనే ప్రచారం జరుగుతుంది. పాలేరు సిపిఎం కు ,కొత్తగూడెం సిపిఐ కి ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం .ఎన్నికల పొత్తులనాటికి ఎలాంటి మార్పులు లేకపోతె ..అప్పడు ఒకే జనరల్ సీటు ఖమ్మం మంత్రి పువ్వాడ పోటీచేయడం ఖాయంగా కనిపిస్తుంది.
జనరల్ స్థానాలుగా మూడు నియోజకవర్గాలు మాత్రమే ఉండడంతో పోటీచేసేనాయకుల సంఖ్య అధికంగా ఉండటం అభ్యర్థులను నిర్ణయించడం అధికార టీఆర్ యస్ కు కత్తిమీద సాములాగానే ఉంది . కరవమంటే కప్పకు విడవమంటే పాముకు కోపంలా ఉంది పరిస్థితి . అందువల్ల తమకు క్లిష్టంగా ఉన్న పాలేరు ,కొత్తగూడెం వామపక్షాలకు ఇవ్వడం వైపే అధినేత మొగ్గుచూపుతున్నారని అంటున్నారు .
2023 ఎన్నికల్లో జనరల్ సీట్లు లో పోటీ ఎలా ఉంటుందని పరిశీలిస్తే …
పాలేరు …
గత ఎన్నికల్లో మాజీ మంత్రి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు . కందాల తర్వాత టీఆర్ యస్ లో చేరి రానున్న ఎన్నికల్లో తిరిగి పోటీచేసేందుకు సిద్ధపడుతున్నారు .పాలేరులో టీఆర్ యస్ పోటిచేస్తే కందాలకే సీటు అని కేసీఆర్ చెప్పారని ఆయన అనుయాయులు అంటున్నారు . తుమ్మల అనుయాయులు మాత్రం ఈసారి తిరిగి తుమ్మల పోటీచేయడం ఖాయమంటున్నారు .రెండు గ్రూపులమధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. వీరి తగాదాలను పార్టీ నిశితంగా పరిశీలిస్తుంది. అందువల్ల సిపిఎం కు కేటాయించడం ద్వారా ఇద్దరికీ చెక్ పెట్టాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
కొత్తగూడెం అసెంబ్లీ …
గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచిన వనమా కాంగ్రెస్ ను వీడి టీఆర్ యస్ లో చేరారు . వనమాకు వయస్సు పై బడటంతో తిరిగి గత ఎన్నికల్లో పోటీచేసిన జలగం వెంకటరావుకు టికెట్ వచ్చే ఛాన్స్ విస్మరించలేమని పరిశీలకుల అభిప్రాయం . అందువల్లే ఇటీవల కేసీఆర్ వెంకట్ రావు ను ప్రగతి భవన్ కు పిలిపించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం . మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఏ ఎన్నికలు ముందు వచ్చిన తాను పోటీ చేసి తీరుతానని అది అసెంబ్లీ అయినా , పార్లమెంట్ అయినా ఒకే అంటున్నారు . ఈయనకు సీటు ఇచ్చేందుకు కేసీఆర్ అయిష్టంగా ఉన్నా , కేటీఆర్ మాత్రం హామీ ఇచ్చినట్లు సమాచారం . అయితే ఈ సీటును సిపిఐ కోరు కుంటుంది.అందువల్ల సిపిఐకి ఇవ్వడానికి అధినేత కేసీఆర్ మొగ్గు చూపవచ్చని తెలుస్తుంది . జాతీయపార్టీ బీ ఆర్ యస్ పెట్టిన నేపద్యంలో గులాబీ బాస్ ఎవరిని పోగొట్టు కునేందుకు సిద్ధంగా లేనందున ఆచితూచి అడుగులు వేస్తున్నారు .