రాజీవ్ గాంధీ చిత్రపటంతో సోనియాకు వీడ్కోలు పలికిన మల్లికార్జున ఖర్గే!
- కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఖర్గే
- ఖర్గేకు పార్టీ పగ్గాలు అప్పగించిన సోనియా గాంధీ
- బదులుగా సోనియాకు రాజీవ్ చిత్రపటాన్ని బహూకరించిన ఖర్గే
- రాజీవ్ ఫొటోను పట్టుకున్న సోనియా ఫొటోను విడుదల చేసిన కాంగ్రెస్
- ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ అంటూ సదరు ఫొటోకు క్యాప్షన్ పెట్టిన వైనం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బుధవారం సోనియా గాంధీ తప్పుకున్నారు. ఇటీవలే జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గేకు ఆమె అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఢిల్లీలోని ఐఏసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఖర్గే పదవీ బాధ్యతల స్వీకారోత్సవంలో సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఈ సందర్భంగా అరుదైన జ్ఞాపికను సోనియాకు ఖర్గే బహూకరించారు. ప్రధానిగా ఉన్నప్పటి దివంగత రాజీవ్ గాంధీ చిత్ర పటాన్ని ఆయన సోనియా గాంధీకి బహూకరించారు. ఖర్గే అందించిన తన భర్త చిత్ర పటాన్ని కార్యక్రమానికి హాజరైన పార్టీ నేతలకు చూపుతూ సోనియా సంతోషం వ్యక్తం చేశారు. వెరసి రాజీవ్ గాంధీ చిత్రపటంతో సోనియాకు ఖర్గే వీడ్కోలు పలికారన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ… రాజీవ్ చిత్ర పటాన్ని పట్టుకున్న సోనియా గాంధీ ఫొటోను విడుదల చేస్తూ దానికి ‘కాల్ ఆప్ డ్యూటీ’ అనే క్యాప్షన్ ను యాడ్ చేసింది.
బాధ్యతల నుంచి విముక్తి కలిగింది: సోనియాగాంధీ
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని సోనియా చెప్పారు. ఈ సవాళ్లను తాము పూర్తి శక్తిసామర్థ్యాలతో, ఐకమత్యంతో ఎదుర్కొంటామని అన్నారు. అందరం కలిసి తమ లక్ష్యాలను సాధిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్ పై 80 ఏళ్ల ఖర్గే గెలుపొందారు. అయితే, ఈయన గెలుపుపై కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. గాంధీలకు విధేయుడు కాబట్టే ఖర్గే గెలిచాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.