టీఆర్ఎస్ నేతలెవరూ మీడియాతో మాట్లాడొద్దు: కేటీఆర్
- ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై పార్టీ నేతలకు కేటీఆర్ సూచన
- కేసు ప్రాథమిక దశలో ఉందని వివరణ
- దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే ఉంటారని వ్యాఖ్య
టీఆర్ యస్ ఎమ్మెల్యేలను బీజేపీ దూతలు కొనుగోలుచేసేందుకు చేసినట్లుగా చెబుతున్న విషయం ఇప్పడు దేశవ్యాపితంగా పెద్ద చర్చనీయాంశం అయింది.తెలంగాణలోని మునుగోడు లో జరుగుతున్న ఉపఎన్నికల్లో ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేవలం టీఆర్ యస్ పన్నిన కుట్రలో భాగమని బీజేపీ ఆరోపిస్తుంది. లేదు మిగతా రాష్ట్రాల్లో చేసినట్లుగానే టీఆర్ యస్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయాలనీ బీజేపీ చూస్తుందని అందులో భాగంగానే ఎమ్మెల్యేలకు ఎరవేసిందని ఆరోపణలు చేస్తుంది.ఈ నేపథ్యంలో టీఆర్ యస్ నేతలు ఎవరు మీడియాతో మాట్లాడవద్దని మంత్రి కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తన పార్టీ నేతలకు గురువారం ఓ కీలక సూచన చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నంపై పార్టీకి చెందిన నేతలెవరూ మీడియాతో మాట్లాడవద్దని ఆయన సూచించారు. ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున పార్టీ నేతలంతా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
”ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే ఉంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అంటూ కేటీఆర్ తన సందేశంలో పేర్కొన్నారు.