హైదరాబాద్ లో గాలి మరింత కలుషితం.. ఆజ్యం పోసిన దీపావళి టపాసులు!
- సాధారణ రోజులతో పోలిస్తే రెట్టింపుకు పైగా పెరిగిన కాలుష్యం
- 2019 స్థాయి కంటే అధికం
- రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పరీక్షల్లో వెల్లడి
సాధారణంగా క్యూబిక్ మీటర్ గాలిలో పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5 అన్నది 34 మైక్రో గ్రాములు ఉండేది. దీపావళి రోజున ఇది 105 కు పెరిగిపోయింది. దీని కారణంగా శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు అంటున్నారు. అంతేకాదు, పీఎం 10 కణాలు కూడా దీపావళి రోజున 138 మైక్రో గ్రాములకు పెరిగిపోయాయి. సాధారణ రోజుల్లో ఇది 78 మైక్రో గ్రాములు ఉండేది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి.. అక్టోబర్ 17 నుంచి నగరవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో వాయు నాణ్యతను పరీక్షిస్తోంది. ఈ నెల చివరి వరకు గాలి నాణ్యత పరీక్షలు కొనసాగనున్నాయి.
ఈ ఏడాది కాలుష్యం గతేడాదితో పోలిస్తే మరింత అధికంగా ఉంది. 2021 దీపావళి సమయంలో కరోనా వల్ల సంబరాలు తక్కువగా ఉండడమే కారణమని ఓ అధికారి పేర్కొన్నారు. ఈ ఏడాది కాలుష్యం స్థాయులు కరోనా ముందు స్థాయికి చేరాయి. 2019 దీపావళి సమయంలో పీఎం 2.5 ఏకంగా 80 మైక్రో గ్రాములకు పెరిగింది. అప్పుడు సాధారణ రోజుల్లో 25 మైక్రో గ్రాములు ఉండేది.
ప్రమాదకరమైన వాయువులను కూడా కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షిస్తుంటుంది. సాధారణ రోజుల్లో సల్ఫర్ డయాక్సైడ్ క్యూబిక్ మీటర్ గాలిలో 6.6 మైక్రో గ్రాములు ఉండేది. ఈ ఏడాది దీపావళి రోజున రెట్టింపై 13.1 మైక్రో గ్రాములకు చేరింది. నైట్రోజన్ సైతం సాధారణ రోజుల్లో 21.1 మైక్రో గ్రాములు ఉండేది కాస్తా, 27.9 మైక్రో గ్రాముల అయింది.