- మనవరాలు నవ్య నవేలి నందా విషయంలో కామెంట్
- శారీరక సంబంధం అనుబంధానికి ముఖ్యమన్న ఎంపీ
- అది లేకుండా బంధం శాశ్వతంగా నిలిచి ఉండదని వ్యాఖ్య
అమితాబ్ బచ్చన్ భార్య, రాజ్యసభ సభ్యురాలైన జయా బచ్చన్ రిలేషన్ షిప్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తన మనవరాలు నవ్య నవేలి నందా (కుమార్తె శ్వేతా బచ్చన్ నందా కుమార్తె) పెళ్లి కాకుండా బిడ్డను కలిగి ఉంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అంతేకాదు, భౌతిక ఆకర్షణ అన్నది అనుబంధానికి చాలా చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ మేరకు తన మనవరాలితో పాడ్ కాస్ట్ రూపంలో మాట్లాడారు.
‘‘నా నుంచి ఇలాంటి మాటలు రావడాన్ని ప్రజలు అభ్యంతరకరంగా భావిస్తారు. కానీ, భౌతిక ఆకర్షణ, సంబంధం అన్నవి చాలా ముఖ్యమైనవి. మా కాలంలో మేము ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. కానీ, నేటి తరం ఇవి చేస్తోంది. వారు ఎందుకు చేయకూడదు? బంధం దీర్ఘకాలం పాటు కొనసాగాలంటే ఇవి కూడా ముఖ్యమే. శారీరక సంబంధం లేకపోతే ఆ బంధం శాశ్వతంగా నిలిచి ఉండదు. కేవలం ప్రేమ, తాజా గాలి, సర్దుబాటుపైనే కొనసాగలేము. ఇది (శారీరక సంబంధం/భౌతిక ఆకర్షణ) చాలా చాలా ముఖ్యమని నా అభిప్రాయం’’అంటూ జయా బచ్చన్ ఎవరూ ఊహించని విధంగా మాట్లాడారు.