Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మునుగోడులో ఉద్రిక్తత… చివరి రోజున కొట్టుకున్న టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు

  • మునుగోడు మండలం పలివెలలో ఘర్షణ
  • ఈటల కాన్వాయ్ పై దాడికి దిగిన టీఆర్ఎస్ శ్రేణులు
  • వెనువెంటనే ప్రతిస్పందించిన బీజేపీ శ్రేణులు
  • ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్లగొండ జడ్పీ చైర్మన్ జగదీశ్ కు గాయాలు
  • పల్లా రాజేశ్వరరెడ్డే ఘర్షణకు కారణమన్న ఈటల

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సాంతం సాఫీగానే సాగినా…ప్రచారం ముగిసే రోజైన మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు మండలం పలివెలలో మంగళవారం మధ్యాహ్నం ప్రచారంలో సాగుతున్న బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా దాడికి దిగాయి. అయితే ఈ దాడికి వెనువెంటనే ప్రతిస్పందించిన బీజేపీ శ్రేణులు కూడా ప్రతిదాడులకు దిగాయి. వెరసి మరికొన్ని గంటల్లో ప్రచారం ముగుస్తుందనగా… మునుగోడు ఉప ఎన్నికల్లో రభస చోటుచేసుకుంది.
ఈటల కాన్వాయ్ పలివెలకు రాగానే… కాన్వాయ్ లోని వాహనాలపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. అప్పటికే కాన్వాయ్ ను వెన్నంటి వస్తున్న బీజేపీ శ్రేణులు దాడికి ఎదురొడ్డాయి. ఈ క్రమంలో ఇరు పార్టీలు శ్రేణులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నాయి. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టగా… అప్పటికీ శాంతించని రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నాయి.
టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో ఈటల కాన్వాయ్ లోని పలు వాహనాల అద్దాలు ధ్వంసం కాగా… ఈటల పీఆర్వో కాలికి గాయమైంది. అదే సమయంలో బీజేపీ శ్రేణుల దాడిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ జగదీశ్ కు గాయాలయ్యాయి. టీఆర్ఎస్ శ్రేణులు తమపై దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ నిలుచున్నారని ఈటల మండిపడ్డారు. అంతేకాకుండా ఈ దాడికి కారణం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డే కారణమంటూ ఆయన ఆరోపించారు.

Related posts

అసైన్డ్ లాండ్స్ పై రైతులకు పూర్తి హక్కులు: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

Drukpadam

తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న డీఐజీ

Drukpadam

జీపీఎస్ పరికరంతో భర్త రాసలీలల గుట్టురట్టు చేసిన భార్య

Drukpadam

Leave a Comment