సీఎం జగన్ అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో బ్లేడుతో మణికట్టు కోసుకున్న మహిళ
అమరావతి వచ్చిన ఆరుద్ర అనే మహిళ
కుమార్తె అచేతన స్థితిలో ఉందని సీఎంకు చెప్పేందుకు ప్రయత్నం
సీఎంని కలిసే అవకాశం ఇవ్వని అధికారులు
మనస్తాపం చెందిన మహిళ
అమరావతిలో ఏపీ సీఎం జగన్ కార్యాలయం వద్ద ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. సీఎం అపాయింట్ మెంట్ లభించలేదన్న మనస్తాపంతో ఆమె మణికట్టు కోసుకుని బలవన్మరణం చెందేందుకు యత్నించారు.
ఆమెను కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్ర అనే మహిళగా గుర్తించారు. ఆమె కుమార్తె సాయిలక్ష్మీచంద్ర వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. ఆమె చికిత్సకు రూ.2 కోట్లు కావాలని వైద్యులు చెప్పడంతో ఆరుద్ర తల్లడిల్లిపోయింది. తన కుమార్తెను కాపాడాలని సీఎం జగన్ ను వేడుకునేందుకు ఆమె సీఎం కార్యాలయం వద్దకు వచ్చారు.
కనీసం లేచి నిలబడలేని కుమార్తెతో సహా అక్కడికి వచ్చిన ఆ మహిళ స్పందన కార్యక్రమంలో అధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. కుమార్తె చికిత్స కోసం అన్నవరంలోని తమ ఇంటిని అమ్ముకోనివ్వకుండా మంత్రి దాడిశెట్టి రాజా గన్ మన్ మరో కానిస్టేబుల్ తో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. సీఎం జగన్ ను కలిసే అవకాశం ఇప్పించాలని వారిని ప్రాధేయపడ్డారు.
అయితే సీఎం జగన్ అపాయింట్ లభ్యం కాకపోవడంతో ఆమె ఇక తమకు న్యాయం జరగదని భావించారు. ముఖ్యమంత్రిని కలవాలంటే ముందు ఎమ్మెల్యేలను కలవాలని చెబుతున్నారని, ఇక తమ బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ, ఓ బ్లేడుతో మణికట్టు వద్ద కోసుకున్నారు. ఆమె కింద పడిపోగా, వీల్ చెయిర్ లో ఉన్న ఆమె కుమార్తె పరిస్థితి చూసి స్థానికులు చలించిపోయారు. అక్కడివారు ఆ మహిళకు ప్రథమ చికిత్స చేసినట్టు తెలుస్తోంది.
సీఎం ఇంటిముందే ఓ మహిళ న్యాయం కోసం ఆత్మహత్యాయత్నం చేసిందంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా?: నారా లోకేశ్
కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్ర అనే మహిళ చక్రాల కుర్చీకే పరిమితమైన తన కుమార్తెను ఆదుకోవాలని సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చి, ఆ ప్రయత్నం ఫలించక ఆత్మహత్యాయత్నం చేయడం తెలిసిందే.
వెన్నెముక సమస్యతో బాధపడుతున్న కుమార్తెకు చికిత్స కోసం రూ.2 కోట్లు కావాల్సి ఉండగా, తన ఇంటిని అమ్ముకోనివ్వకుండా ఇద్దరు పోలీసు సిబ్బంది అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు. వారిలో ఒకరు మంత్రి దాడిశెట్టి రాజా గన్ మన్ అని తెలిపారు. అమరావతిలో సీఎంను కలిసేందుకు అధికారులు ఒప్పుకోకపోవడంతో ఆమె బ్లేడుతో మణికట్టు కోసుకున్నారు.
దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి ఇంటి ముందే న్యాయం కోసం ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ రెడ్డి పాలనలో సామాన్య మహిళల కష్టాలు తీరుతాయనుకోవడం అత్యాశేనని పేర్కొన్నారు.
తాడేపల్లి ప్యాలెస్ లో అభినవ నీరో జగన్ రెడ్డికి కాకినాడలో వైసీపీ నేతల అరాచకాలు కనపడవు అని విమర్శించారు. అచేతన స్థితిలో ఉన్న కుమార్తెకి వైద్యం చేయించలేని ఆడపడుచు ఆరుద్ర ఆత్మహత్యాయత్నం ఆర్తనాదాలు వినపడవు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ బిడ్డ వైద్యానికి తక్షణమే సాయం అందించాలని నారా లోకేశ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుద్ర ప్రాణాలు కాపాడాలని స్పష్టం చేశారు. మంత్రి పేరుతో కబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతున్న కానిస్టేబుళ్లని అరెస్టు చేయాలని పేర్కొన్నారు.