Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు…

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు…

హుటాహుటీన ఆసుపత్రికి తరలింపు

  • పంజాబ్ ప్రావిన్స్ లో ఘటన
  • వజీరాబాద్ జిల్లాలో ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ
  • ఇమ్రాన్ ఉన్న కంటైనర్ పై దుండగుల కాల్పులు
  • ఇమ్రాన్ కు గాయాలు 

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కు గాయాలయ్యాయి.

తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ జిల్లాలో ఇమ్రాన్ ఖాన్ నేడు ర్యాలీ నిర్వహించారు. ఆయన ఓ కంటైనర్ వాహనంలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.

కాగా, కాల్పులు జరిపిన వారిని అరెస్ట్ చేసినప్పటికీ, వారెవరన్నది ఇంకా వెల్లడి కాలేదు. ర్యాలీలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్ రాజధాని ఇస్లామాబాద్ వైపు పయనిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇమ్రాన్ తో పాటు ఆయన ముఖ్య అనుచరుడిగా భావించే ఎంపీ ఫైజల్ జావెద్ కూడా గాయపడ్డారు.

పాక్ ప్రధాని పదవిని కోల్పోయినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ తన ప్రాణాలకు ముప్పు ఉందని పలు వేదికలపై చెబుతున్నారు. అదే సమయంలో అధికార పక్షంపైనా, పాక్ నిఘా విభాగం ఐఎస్ఐ పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఐఎస్ఐ రహస్యాలు తన గుప్పిట్లో ఉన్నాయని హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ పై కాల్పులు జరగడం గమనార్హం.

ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపిన దుండగుడి కాల్చివేత!

Imran Khan attacker was shot dead
పాకిస్థాన్ లో ముందస్తు ఎన్నికలు జరపాలన్న డిమాండ్ తో పీటీఐ పార్టీ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ ర్యాలీ చేపట్టగా, ఆయనపై ఓ దుండగుడు కాల్పులు జరపడం తెలిసిందే. ఈ ర్యాలీ వజీరాబాద్ చేరుకున్న సమయంలో జనసమూహంలో ఉన్న ఓ వ్యక్తి తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇమ్రాన్ కు గాయాలయ్యాయి.

కాగా, కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా బలగాలు కాల్చిచంపినట్టు వెల్లడైంది. ఇమ్రాన్ ఖాన్ సన్నిహితవర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా ఈ మేరకు వెల్లడింది. కాల్పుల్లో గాయపడిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పీటీఐ వర్గాలు తెలిపాయి.

దాడి అనంతరం ఇమ్రాన్ ఖాన్ తొలిసారిగా స్పందించారు. అల్లా తనకు పునర్జన్మను ప్రసాదించాడని దేవుడ్ని కీర్తించారు. భగవంతుడి కృపతో తాను పోరాటానికి పునరంకితం అవుతానని ఇమ్రాన్ ఉద్ఘాటించారు.

కాగా, విపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ పై జరిగిన దాడిని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. పాక్ రాజకీయాల్లో హింసకు తావులేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించాలని హోంమంత్రిని ఆదేశించినట్టు వెల్లడించారు. ఈ ఘటనలో గాయడిన ఇమ్రాన్ ఖాన్ తదితరులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

అటు, ఇమ్రాన్ పై కాల్పుల ఘటన పట్ల భారత కేంద్ర ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్జి ఓ ప్రకటన చేశారు. ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగినట్టు తమకు ఇప్పుడే తెలిసిందని వెల్లడించారు. కాల్పుల అనంతరం అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై తమ వద్ద తగిన వివరాలు అందుబాటులో లేవని తెలిపారు.

Related posts

రూ.21 కోట్లు విలువ చేసే బంగారం పట్టివేత..

Drukpadam

టీవీ షో చూసి… మాజీ భార్యకు హెచ్ఐవీ రక్తం ఎక్కించిన యువకుడు!

Drukpadam

ఇంట్లో అక్రమ టెలిఫోన్ ఎక్చేంజి నడుపుతున్న తోబుట్టువులు.. దేశ విద్రోహ సందేశాల వ్యాప్తి!

Drukpadam

Leave a Comment