పవన్ కల్యాణ్ ఇంటివద్ద రెక్కీ చేస్తారా… బతకనివ్వరా?: చంద్రబాబు
- పవన్ ఇంటివద్ద అనుమానాస్పద వాహనాలు
- కొత్త వ్యక్తుల సంచారం.. స్పందించిన చంద్రబాబు
- ఎవరిని బెదిరిస్తారంటూ ఆగ్రహం
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు చింతకాయల రాజేష్ లను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంటివద్ద అనుమానాస్పద వ్యక్తుల సంచారంపైనా ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు స్పందించారు.
“పవన్ కల్యాణ్ ఎక్కడో ఉంటే… ఆయన మీద దాడి చేస్తారంట, రెక్కీ చేస్తారంట! ఎవరిని బెదిరిస్తారు మీరు? రాష్ట్రంలో అందరినీ చంపేస్తారా? అందరినీ జైల్లో పెట్టి కొడతారా? టార్చర్ చేస్తారా మీరు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు కూడా రాజేష్ ను కొట్టారు… దీనిపై మాకు సమాచారం అందింది అని మండిపడ్డారు. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటివి చూస్తే కంపరం కలుగుతుంది, బాధ, ఆవేశం కలుగుతున్నాయి. కానీ సభ్యత అడ్డం వస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న అధికారులకు చెబుతున్నా… మీరనుకున్నది జరగదు, జరగనివ్వం” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోదు: సోము వీర్రాజు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అనుసరిస్తూ పలువురు వ్యక్తులు అనుమానాస్పదంగా కదలాడుతున్నారంటూ వచ్చిన వార్తలపై బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా స్పందించారు. పవన్ కల్యాణ్ కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోదంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు.
హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ ఇంటి వద్దకు రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి.. పవన్ బౌన్సర్లతో గొడవ పడ్డ వైనాన్ని ఈ సందర్బంగా వీర్రాజు ప్రస్తావించారు. పవన్ ఇంటి వద్దకు వచ్చిన అపరిచితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కు పొంచి ఉన్న ముప్పుపై సోము వీర్రాజు స్పందించారన్న వాదన వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్ ను కొన్ని అనుమానాస్పద వాహనాలు వెంబడిస్తున్నాయి: నాదెండ్ల మనోహర్!
పవన్ కల్యాణ్ ఇంటి నుంచి బయటికి వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని కొన్ని అనుమానాస్పద వాహనాలు వెంబడిస్తున్నాయని నాదెండ్ల వివరించారు. ఆ వాహనాల్లోని వ్యక్తులు పవన్ కల్యాణ్ కారును నిశితంగా పరిశీలిస్తున్నారని, వారు అభిమానులు కారని పవన్ కల్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా చెబుతున్నారని నాదెండ్ల వెల్లడించారు.
నిన్న కారులోనూ, ఇవాళ బైకులపైనా పవన్ వాహనాన్ని అనుసరించారని వివరించారు. అంతకుముందు, సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు వచ్చి పవన్ నివాసం వద్ద గొడవ చేశారని నాదెండ్ల తెలిపారు. పవన్ ఇంటి ఎదురుగా వారు కారు నిలపగా, సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోబోయారని, దాంతో వారు బూతులు తిట్టడం మొదలుపెట్టారని, పవన్ కల్యాణ్ ను దూషించారని నాదెండ్ల పేర్కొన్నారు.
సిబ్బందిని వారు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని, కానీ సిబ్బంది సంయమనం పాటించి ఆ ఘటనను వీడియో తీశారని వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన తెలంగాణ ఇన్చార్జి శంకర్ గౌడ్ కు అందించగా, ఆయన జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారని నాదెండ్ల వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు.