కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తో బంధం తెంచుకోబోతున్నారా ?
-షోకాజ్ నోటీసుకు స్పందించని కోమటిరెడ్డి వెంకటరెడ్డి …
-రెండో షోకాజ్ నోటీసు జారీ చేసిన ఏఐసీసీ
-మునుగోడులో కాంగ్రెస్ ప్రచారానికి వెళ్లని వెంకట్ రెడ్డి
-ఎన్నికల్లో తన సోదరుడికి ఓటేయాలని కాంగ్రెస్ నేతలకు ఫోన్
-మునుగోడులో ఎలాగూ కాంగ్రెస్ గెలవదని వ్యాఖ్య
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ఎంపీ …సుదీర్ఘకాలం కాంగ్రెస్ ఉన్న బంధాన్ని తెంచుకోబోతున్నారా ? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు .. కాంగ్రెస్ పార్టీకి అనేక విజయాలను అందించిన కోమటి రెడ్డి బ్రదర్స్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో విభేదించారు. తమ్ముడు బీజేపీలో చేరి మునుగోడు ఉపఎన్నిలకల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. కాంగ్రెస్ లో ఉన్న సోదరుడు వెంకటరెడ్డి మునుగోడు ఎన్నికలకు దూరంగా ఉన్నారు . పైగా తన పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పోటీలో ఉండగా తన అనుయాయులకు తన తమ్ముడికి ఓట్లు వేయమని ఫోన్ చేసి చెప్పి ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన తిరిగి వచ్చారు .
వెంకారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో ఆయనకు ఏఐసీసీ షోకాజ్ జారీచేసింది.10 రోజుల్లో దానికి సమాధానం ఇవ్వాలని అల్టిమేటం ఇచ్చింది. అయినప్పటికీ నోటీసుకు స్పందించని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి మరోసారి షోకాజు కు సమాధానం ఇవ్వాలని నోటీసులు పంపింది.
మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమి ఖాయమని వ్యాఖ్యానించడంతో పాటుగా… ఈ సారికి తన సోదరుడికే ఓటు వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పార్టీ అధిష్ఠానం నుంచి శుక్రవారం రెండో షోకాజ్ నోటీసు జారీ అయ్యింది. ఇదివరకే ఓ నోటీసు జారీ చేసి సంజాయిషీ ఇవ్వాలని ఏఐసీసీ కోరినా… వెంకట్ రెడ్డి పట్టించుకోలేదు. అసలు షోకాజ్ నోటీసుపై ఆయన స్పందించను కూడా లేదు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ పార్టీ అధిష్ఠానం ఆయనకు శుక్రవారం రెండో షోకాజ్ నోటీసు జారీ చేసింది.
వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ నుంచి దక్కిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయన ఆ వెంటనే బీజేపీలో చేరిపోయారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేయగా…కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. ఈ క్రమంలో స్రవంతి తరఫున ప్రచారం చేయాలని వెంకట్ రెడ్డిని కోరినా ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అంతేకాకుండా ప్రచారానికి దూరంగా ఉంటూ ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు.
ఆస్ట్రేలియా వెళ్లే ముందు తనకు దగ్గరగా ఉన్న పలువురు కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసిన వెంకట్ రెడ్డి… వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్న తన సోదరుడికి ఓటు వేయాలని చెప్పారు. ఈ ఒక్కసారికి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ ఫోన్ కాల్ ఆడియో రూపంలో బయటకు వచ్చి పెను కలకలమే రేపింది. ఆ వెంటనే ఆస్ట్రేలియా వెళ్లిన వెంకట్ రెడ్డి… అక్కడ తనకు స్వాగతం చెప్పిన వారితో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎలాగూ గెలవదని, అందుకే తాను ప్రచారానికి వెళ్లడం లేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. ఈ రెండు ఘటనలను దృష్టిలో పెట్టుకుని గత నెల 22న వెంకట్ రెడ్డికి ఏఐసీసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దానికి వెంకట్ రెడ్డి స్పందించకపోవడంతో తాజాగా శుక్రవారం రెండో షోకాజ్ నోటీసు జారీ చేసింది.