గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదాన్ గాధ్వి!
- జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఇసుదాన్ గాధ్వి
- జర్నలిజాన్ని వదిలి ఆప్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం
- సీఎం అభ్యర్థి కోసం గుజరాత్ లో పోల్ పెట్టిన ఆప్
- పోల్ ఫలితాలను వెల్లడించి, గాధ్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దేశ రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికింది. దేశ రాజకీయాల్లో సరికొత్త పద్దతులను అవలంబిస్తున్న ఆప్… ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం అభ్యర్థిని ఎన్నుకునే విషయంలో పోల్ నిర్వహిస్తోంది. ఇటీవలే ముగిసిన పంజాబ్ ఎన్నికల్లో పోల్ ద్వారానే భగవంత్ మాన్ ను సీఎం అభ్యర్థిగా ఆప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించగా… భగవంత్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
తాజాగా గుజరాత్ లోనూ ఆప్ పోల్ సంప్రదాయాన్నే కొనసాగించింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన గుజరాత్ లో తన సీఎం అభ్యర్థిగా అసుదాన్ గాధ్విని ప్రకటించింది. తమ పార్టీ తరఫున ఎవరు సీఎం అభ్యర్థిగా ఉండాలో నిర్ణయించండి అంటూ గుజరాత్ ప్రజలకు సూచించిన ఆప్… పోల్ లో వచ్చిన ఫలితాల మేరకే ఇసుదాన్ గాధ్విని గుజరాత్ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. గాధ్వి పేరును అధికారికంగా ప్రకటించారు.
రాజకీయ నేతగా మారక ముందు ఇసుదాన్ గాధ్వి జర్నలిస్టుగా పని చేశారు. వీటీవీ గుజరాతికి ఎడిటర్ గా వ్యవహరించిన ఆయన.. వీటివీ న్యూస్ కూ ఎడిటర్ గా పని చేశారు. అంతకుముందు వీటీవీలో ప్రసారమైన మహామంతన్ కు యాంకర్ గానూ వ్యవహరించారు. ఆప్ ప్రారంభం తర్వాత జర్నలిజానికి స్వస్తి చెప్పిన గాధ్వి… రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.