Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చైనా రాకెట్ పడిపోతుందన్న భయంతో స్పెయిన్ లో విమానాశ్రయాల మూసివేత!

చైనా రాకెట్ పడిపోతుందన్న భయంతో స్పెయిన్ లో విమానాశ్రయాల మూసివేత!

  • ఇటీవల అంతరిక్షంలోకి భారీ రాకెట్ ప్రయోగించిన చైనా
  • స్పెయిన్ వద్ద భూవాతావరణంలోకి ప్రవేశించనున్న రాకెట్
  • స్పెయిన్ లో పలు నగరాల్లో భయాందోళనలు
  • నిలిచిపోయిన విమానాల రాకపోకలు

స్పెయిన్ లో ఇప్పుడు పలు విమానాశ్రయాలు మూతపడ్డాయి. చైనాకు చెందిన ఓ భారీ రాకెట్ భూమిపై పడిపోతుందన్న భయమే అందుకు కారణం. అత్యంత రద్దీగా ఉండే బార్సిలోనా ఎయిర్ పోర్టులోనూ కార్యకలాపాలు మందగించాయి.

టర్రాగోనా, ఇబిజా, ర్యూస్ ప్రాంతాల నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. లా రియోజా, కాస్టిల్లా, లియోన్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్పెయిన్ లోనే కాదు, ఫ్రాన్స్ లోని మార్సెల్లీ ఎయిర్ పోర్టులోనూ హై అలర్ట్ విధించారు.

చైనాకు చెందిన లాంగ్ మార్చ్ 5బీ (సీజెడ్-5బీ) రాకెట్ భూవాతావరణంలోకి ప్రవేశించిందన్న సమాచారం ఇప్పుడు పలు దేశాలను హడలెత్తిస్తోంది. ముఖ్యంగా, స్పెయిన్ లో తీవ్ర కలకలం రేగింది. ఈ 20 టన్నుల భారీ రాకెట్ స్పెయిన్ వద్ద నేడు భూవాతావరణంలో ప్రవేశిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నియంత్రణ కోల్పోయిందని, ఎక్కడైనా పడిపోయే ప్రమాదం ఉందని యూరో కంట్రోల్ సంస్థ హెచ్చరించిందని స్పెయిన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ వెల్లడించింది. అందుకే కొన్నిచోట్ల ఎయిర్ పోర్టుల మూసివేత, కొన్ని విమానాల దారిమళ్లింపు తదితర చర్యలు చేపట్టినట్టు వివరించింది.

చైనా రాకెట్ గంటకు 17,500 కిమీ వేగంతో దూసుకువస్తుండగా, అంచనా వేసిన సమయానికి కొన్ని నిమిషాలు ఆలస్యం అయినా, కొన్ని వందల మైళ్ల అవతల పడిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

కాగా, కెనడా ఖగోళ శాస్త్రవేత్త ఎరికా దీనిపై స్పందించారు. చైనా రాకెట్ శుక్రవారం నాడు భూ వాతావరణంలో ప్రవేశిస్తోందని, ఇది స్పెయిన్ దిశగా దూసుకువస్తోందని తెలిపారు. దీని శకలాలు కచ్చితంగా ఎక్కడ పడతాయి, ఎంతమేర నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయన్న దానిపై స్పష్టత లేదని వెల్లడించారు.

సీజెడ్-5బీ రాకెట్ చైనా ప్రయోగించిన రాకెట్లన్నింటిలో శక్తిమంతమైనది. అంతరిక్షంలో నిర్మాణదశలో ఉన్న చైనా స్పేస్ స్టేషన్ కు అవసరమైన మెంగ్టియన్ క్యాబిన్ మాడ్యూల్ తరలించేందుకు ఈ రాకెట్ ను వినియోగించారు. అక్టోబరు 31న ఈ బాహుబలి రాకెట్ క్యాబిన్ మాడ్యూల్ ను మోసుకుంటూ నింగికి ఎగిసింది. పనిపూర్తయిన అనంతరం రాకెట్ భూవాతావరణంలో ప్రవేశించి దగ్ధమైపోవాల్సి ఉంటుంది.

అయితే, ఇది నియంత్రణ కోల్పోయి భూమి పడిపోతే తీవ్ర నష్టం జరుగుతుందన్న వాదనలను చైనా కొట్టిపారేసింది. రాకెట్లు గ్రౌండ్ స్టేషన్లతో సంబంధాలు కోల్పోయి భూవాతావరణంలో ప్రవేశించడం సాధారణమేనని, తాజా రాకెట్ కూడా ఆ కోవలోకే వస్తుందని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. తమ రాకెట్ వల్ల తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంటుందని సిగ్గుమాలిన ప్రచారం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేసింది.

Related posts

గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం.. స్వాతంత్ర వేడుకల్లో జగన్

Ram Narayana

పాముతో భార్యను చంపిన వ్యక్తికి రెండు జీవితఖైదులు!

Drukpadam

వైసీపీ ఎంపీపై లోక్ సభ స్పీకర్ ప్రశంసల జల్లు!

Drukpadam

Leave a Comment