తన కారుని ఆనుకుని నిలబడ్డాడన్న కోపంతో, బాలుడిని బలంగా తన్నిన యువకుడు..
-రాజస్థాన్ నుంచి వలస వచ్చిన బాలుడి కుటుంబం
-నిందితుడిపై ఫిర్యాదు చేసినా తొలుత పట్టించుకోని పోలీసులపై విమర్శలు
-మండిపడిన ప్రతిపక్ష నేతలు
-ఎట్టకేలకు నిన్న నిందితుడికి అరదండాలు
-బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న అధికారులు
తన కారును ఆనుకుని నిల్చున్న ఆరేళ్ల బాలుడిపై కారు యజమాని కాలితో తన్ని గాయపరిచాడు. కేరళలోని కన్నూరు జిల్లా థాలాస్సెరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో పోలీసులు కూడా స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరికి మంత్రులు, విపక్ష నేతలు కూడా స్పందించడంతో పోలీసులు అప్పుడు స్పందించారు. నిందితుడిని నిన్న అరెస్ట్ చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజస్థాన్ నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన ఆరేళ్ల బాలుడు ఆడుకుంటూ అక్కడున్న కారును ఆనుకుని నిల్చున్నాడు. అది గమనించిన కారు యజమాని మహమ్మద్ షెహజాద్ (20) ఆగ్రహంతో ఊగిపోతూ బాలుడి పక్కలో బలంగా తన్నాడు. దీంతో షాక్‌కు గురైన చిన్నారి నెమ్మదిగా అక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకు కదిలాడు. మరోవైపు, బాలుడిపై అతడి దాడిని చూసిన స్థానికులు అక్కడికి చేరుకుని పిల్లాడిని ఎందుకలా తన్నావని షెహజాద్‌ను ప్రశ్నించారు. వారికి అతడు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారు స్పందించకపోవడంతో వారి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు, షెహజాద్ బాలుడిని తన్నిన వీడియో వైరల్ కావడంతో కేరళ మంత్రులు, విపక్ష నేతలు స్పందించారు. నిందితుడిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. దీంతో దిగివచ్చిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు షెహజాద్‌ను నిన్న అరెస్ట్ చేశారు. అతడి దాడిలో గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించిన అధికారులు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి వీణాజార్జ్ మాట్లాడుతూ.. బాధిత బాలుడి కుటుంబానికి మహిళా శిశు అభివృద్ధి విభాగం అన్ని విధాలా సాయం అందిస్తుందని అన్నారు.