భారత్ లో రేపటి చంద్రగ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే…!
- నవంబరు 8న చంద్ర గ్రహణం
- భారత్ లోని పలు ప్రాంతాల్లో కనిపించనున్న గ్రహణం
- అత్యధిక ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం
సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు… సూర్య కాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుపడడం వల్ల చంద్ర గ్రహణం సంభవిస్తుందన్న సంగతి తెలిసిందే. రేపు (నవంబరు 8) చంద్రగ్రహణం ఏర్పడనుండడంతో, ఆ ఖగోళ ఘట్టాన్ని వీక్షించేందుకు ఉత్సాహవంతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్ లోనూ పలు ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కనువిందుచేయనుంది.
సంపూర్ణ చంద్ర గ్రహణ క్షణాలు సాయంత్రం 4.23 గంటలకు ప్రారంభమై 1 గంట 25 నిమిషాల పాటు కనిపిస్తుంది. ఈ గ్రహణం ప్రక్రియ పూర్తవడానికి మొత్తం 3 గంటల 40 నిమిషాలు పడుతుంది.
అయితే ఇటానగర్, గువాహటి, సిలిగురి ప్రాంతాల్లో మాత్రమే సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడవచ్చు. కోల్ కతా, భువనేశ్వర్, ఢిల్లీ, శ్రీనగర్, చెన్నై, గాంధీనగర్, ముంబయి వంటి ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపించనుంది.
కాగా, కోల్ కతాలోని ఎంపీ బిర్లా ప్లానెటోరియం నిపుణులు పేర్కొన్న వివరాల ప్రకారం… పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడే అవకాశాలు ఉండవు. ఎందుకంటే పౌర్ణమి సందర్భంగా సూర్యుడు, భూమి, చంద్రుడు కచ్చితంగా ఒకే సరళ రేఖపైకి రావని నిపుణులు చెబుతున్నారు. భూమి కక్ష్య, చంద్రుని కక్ష్య పరస్పరం 5 డిగ్రీల కోణంలో వంగి ఉండడమే అందుకు కారణమట.