ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట!
- ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో క్లీన్ చిట్
- శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టేసిన కోర్టు
- ఏపీ సీఎస్ గా నియామకం కావడానికి శ్రీలక్ష్మికి తొలగిన అడ్డంకులు
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) నుంచి ముడుపులు స్వీకరించారన్న కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఆమెపై మోపిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. శ్రీలక్ష్మిని నిర్దోషిగా పరిగణిస్తూ, ఈ కేసులో ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ మంగళవారం హైకోర్టు తీర్పు చెప్పింది. ఓఎంసీ ముడుపుల వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేయడంతో శ్రీలక్ష్మి ఏడాదిపాటు జైలులో గడపాల్సి వచ్చింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి 2004-09 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో మైనింగ్ లీజులు పొందేందుకు శ్రీలక్ష్మి సహకరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు గాను ఆమె భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు శ్రీలక్ష్మిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
తాజాగా ఈ కేసును హైకోర్టు విచారించింది. శ్రీలక్ష్మిపై అభియోగాలకు సరైన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ కు చీఫ్ సెక్రెటరీగా శ్రీలక్ష్మి నియామకానికి అడ్డంకులు తొలిగినట్టయింది. అయితే, ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని సీబీఐ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టులో సీబీఐ పోరాడుతోంది.