Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్ తీరుతో పులివెందులకూ చెడ్డపేరు: చంద్రబాబు!

జగన్ తీరుతో పులివెందులకూ చెడ్డపేరు: చంద్రబాబు!

  • నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్షలు
  • ఇప్పటిదాకా 126 నియోజక వర్గాల సమీక్షలను పూర్తి చేసిన వైనం
  • తాజాగా పులివెందుల నియోజకవర్గంపై సమీక్ష
  • సొంత నియోజకవర్గ ప్రజల్లో కూడా వ్యతిరేకత తెచ్చుకున్న ముఖ్యమంత్రిగా జగన్  నిలిచిపోతారని వ్యాఖ్య

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుతో ఆయనను ఎన్నుకున్న పులివెందులకు కూడా చెడ్డ పేరు వస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. జగన్ తన పాలనా తీరు, విద్వేష రాజకీయాల కారణంగా తనను ఎన్నుకున్న పులివెందులకూ చెడ్డపేరు తెస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన రివర్స్ పాలనతో సొంత నియోజకవర్గ ప్రజల నుంచి కూడా జగన్ వ్యతిరేకత తెచ్చుకున్నారని ఆయన పేర్కొన్నారు.

నియోజకవర్గాల సమీక్షలో భాగంగా మంగళ, బుధవారం పులివెందుల, వెంకటగిరి, నూజివీడు, తుని, పాడేరు, పాలకొండ నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన జగన్ తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యపై సమాధానం చెప్పలేక, విద్వేష రాజకీయాల కారణంగా ముఖ్యమంత్రి నైతికంగా పతనం అయ్యారని చంద్రబాబు అన్నారు. బాబాయ్ హత్య కేసులో స్వయంగా ముఖ్యమంత్రి దోషులను కాపాడడం స్థానిక ప్రజలకు కూడా మింగుడు పడడంలేదన్నారు.

ఒక్క చాన్స్ అంటూ వచ్చిన జగన్ కు అదే చివరి చాన్స్ అవ్వనుందని…ప్రజల్లో ఎక్కడ చూసినా ఈ చర్చే కనిపిస్తోందన్నారు. సొంత నియోజకవర్గ ప్రజల్లో కూడా వ్యతిరేకత తెచ్చుకున్న ముఖ్యమంత్రిగా జగన్  నిలిచిపోతారన్నారు. అన్ని వర్గాల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్న పరిస్థితిని రాజకీయంగా అనుకూలంగా మలచుకోవాలని ఆయన టీడీపీ నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రజలకు మరింత చేరువ అవ్వాలని సూచించారు.

నియోజకవర్గాల సమీక్షల్లో భాగంగా బుధవారం నాటికి 126 నియోజకవర్గాల ఇంచార్జ్ లతో చంద్రబాబు సమీక్షలు చేశారు. నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు, మెంబర్ షిప్, పార్టీ కార్యక్రమాల నిర్వహణపైనా నేతలతో అధినేత సమీక్షలు జరిపారు. గ్రామస్థాయి వరకు గ్రూపులు అనే అంశమే ఉండకూడదని…ఇంచార్జ్ లు అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచించారు.

ఇంచార్జ్ లతో రివ్యూల అనంతరం వారి పనితీరులో మార్పు వచ్చిందా? లేదా? అనే అంశంపైనా సమాచారం తెప్పించుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా నేతలు పనితీరు మెరుగుపరుచుకోకపోతే దానికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. సమీక్షల అనంతరం కూడా కొందరు నేతలు యాక్టివ్ అవ్వలేదని తన దృష్టికి వచ్చిందని, అటువంటి నేతల విషయంలో త్వరలో నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు అన్నారు.

Related posts

వైసీపీ పై లోకేష్ మాటల తూటాలు …ఎక్కడికి వెళ్లిన వదలమని వార్నింగ్ !

Drukpadam

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు షడ్యూల్ విడుదల -అక్టోబర్ 17 ఎన్నిక…

Drukpadam

అసెంబ్లీ అభ్యర్థులపై బీఆర్ యస్ లీకులు …కరీంనగర్ లోకసభకు అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్ …

Drukpadam

Leave a Comment