భవానీ భక్తుడిలా వచ్చి.. టీడీపీ నేతపై హత్యాయత్నం!
- పోల్నాటి శేషగిరిరావుపై కత్తితో దాడిచేసిన దుండగుడు
- తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ నేత
- ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న యనమల
- దాడుల సంస్కృతి మీదేనన్న మంత్రి దాడిశెట్టి రాజా
భవానీ భక్తుడి వేషధారణలో వచ్చిన ఓ దుండగుడు కాకినాడకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు పోల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తునిలో నివసిస్తున్న శేషగిరిరావు ఇంటికి నిన్న ఉదయం భవానీమాలలో ఉన్న దుండగుడు వచ్చాడు. శేషగిరిరావు ఆయనకు డబ్బులు ఇచ్చారు.
అయితే, తనకు బియ్యం కావాలని కోరడంతో అవి తెచ్చి దుండగుడి పంచెలో పోస్తుండగా వెంట తెచ్చుకున్న కత్తితో హఠాత్తుగా ఆయనపై దాడికి దిగాడు. దీంతో షాక్‌కు గురైన ఆయన తప్పించుకునే ప్రయత్నంలో కిందపడ్డారు. కిందపడిన ఆయనపై కత్తితో దాడికి యత్నించాడు. దీంతో ఆయన కేకలు వేయడంతో కత్తిని అక్కడే పడేసి దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడినప్పటికీ అతడిని పట్టుకునేందుకు శేషగిరిరావు కొంతదూరం వెంబడించారు. గేటు బయకు వచ్చాక దుండగుడు బైక్‌పై పరారయ్యాడు.
కత్తి వేటు పడడంతో చేతి కండరం వేలాడుతూ, తలకు తీవ్ర గాయమై రక్తమోడుతున్న శేషగిరిరావును కుటుంబ సభ్యులు వెంటనే తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనను టీడీపీ మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, చిక్కాల రామచంద్రరావు తదితరులు పరామర్శించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ఈ ఘటనకు జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. వ్యక్తులపై దాడి సంస్కృతి తెలుగుదేశం నాయకులదేనని అన్నారు.