కేసీఆర్ సారు జర్నలిస్టుల గోడు వినండి మీరు ….
–జర్నలిస్టుల ఇల్లు, ఇళ్ల స్థలాలపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి
–కరోనా లో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి
–కనీసం 10 లక్షలకు తగ్గకుండా సహాయం అందించాలి
–అర్హులందరికీ అక్రిడేషన్ లు ఇవ్వాలి
–జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులను అన్ని హాస్పటల్స్ లో హానర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి
–సీనియర్ జర్నలిస్టులందరికి పెన్షన్ సౌకర్యం కల్పించాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ సారథ్యంలో అనేక పధకాలు చేపట్టి దేశంలోనే వినూత్న పాలన అందిస్తున్న రాష్ట్రంగా పేరు తెచుకున్నందుకు సంతోషం …అన్ని వర్గాల ప్రజలకు ఎదో రకంగా సహాయం అందించేందుకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం . తెలంగాణ మోడల్ దేశమంతా అమలు చేయాలనే ఉద్దేశంతో మీరు పెట్టిన బీఆర్ యస్ పార్టీకి స్వాగతం … అందరికి అడిగిందే తడవుగా అన్ని చేస్తున్న మీరు జర్నలిస్టుల విషయంలో చెప్పిన మాటలను చేసిన వాగ్దానాలను పట్టించుకోక పోవడం శోచనీయం. ఎన్నికల ప్రణాళికలో పెట్టిన హామీలను అమలు చేయడంలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధానంగా జర్నలిస్టుల సమస్యల్లో
1 . ఇల్లు ,ఇళ్లస్థలాలు
2 . అక్రిడేషన్లు
3 .హెల్త్ కార్డుల అమలు
4 .సంక్షేమ కార్యక్రమాలు అమలు
5 .ప్రాధాన్యత క్రమంలో దళిత జర్నలిస్టులకు దళితబంద్
6 .జర్నలిస్టుల బంద్ అమలు చేయాలి
7 .సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ పధకం అమలు
8 .చిన్న పత్రికలను ఆదుకోవాలి
9 .డిజిటల్ మీడియా రంగం దూసుకొస్తోంది దానికి అన్ని సౌకర్యాలు అమలు చేయాలి …
ఇల్లు ,ఇళ్లస్థలాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యాలు అందిన విధంగానే జర్నలిస్టలకు సౌకర్యాలు అందుతాయని స్వరాష్ట్రంలో సొంతఇంటి కల నెరవేరుతుందని జర్నలిస్టులు భావించారు .2014 ఎన్నికల సందర్భంగా జరిగిన జర్నలిస్టుల సమావేశానికి హాజరై అక్రిడేషన్ల అందరికి ఇస్తామని , ఇళ్ల ,ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పారు . అందరికి ఆరోగ్యం అందించేందుకు హెల్త్ కార్డులు ఇస్తామని అన్నారు . అన్నమాట ప్రకారం ఎన్నికల ప్రణాళికలో కూడా వాటిని చేర్చారు .అందుకు సంతోషంగా జర్నలిస్టులు మీకు పాలాభిషేకం చేశారు . అక్రిడేషన్ల విషయంలో కొంత పురోభివృద్ధి ఉంది . కానీ ఇచ్చిన హెల్త్ కార్డులు అమలుకు నోచుకోవడంలేదు . కార్పొరేట్ హాస్పటల్స్ ప్రభుత్వం ఇచ్చిన కార్డులు తీసుకోని పొతే మెట్లు కూడా ఎక్కనివ్వడంలేదు . ఇది సంబంధిత అధికార్ల దృష్టికి తెచ్చాం… అయినా ఫలితం శూన్యం . ఇక ఇళ్లు, ఇళ్ల స్థలాల విషయంలో మంత్రులు , ఎమ్మెల్యేల దయాదక్షిణ్యాలమీద ఆధారపడి కొన్ని చోట్ల ఇచ్చినప్పటికీ దానికి ప్రభుత్వం నుంచి జి ఓ లేదు . మీరుకూడా జిల్లాల పర్యటనలో జర్నలిస్టులకు అందమైన కాలనీలు నిర్మిస్తామని , డబుల్ బెడ్ రూమ్స్ కాకుండా సౌకర్యంగా ఉండే విధంగా త్రీబుల్ బెడ్ రూమ్స్ కట్టిద్దామని , వాటిలో విశాలమైన రోడ్లు ,పార్క్ , లైబ్రరీ , స్విమ్మింగ్ పూల్ ,వాకింగ్ ట్రాక్,జిమ్ ఏర్పాటు చేస్తామని ఖమ్మం పర్యటనలో వాగ్దానం చేశారు . 10 రోజుల్లో ఆర్కిటెక్చర్ ను పంపించి అందమైన కాలనీ నిర్మిస్తామన్నారు . అదే విధంగా వరంగల్ ,నిజామాబాద్ , కరీంనగర్ , హైద్రాబాద్ లలో కూడా వాగ్దానం చేశారు . సుప్రీంకోర్టుపరిధిలో ఉన్నందున ఏమి చేయలేకపోతున్నామని అన్నారు . కానీ గౌరవ కోర్ట్ కూడా జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెప్పింది . మీరు కూడా మీడియా సమావేశాల్లో గత సంవత్సరం మార్చ్ నాటికీ జర్నలిస్టుల ఇళ్లస్థలాల విషయంలో మంచి వార్త ఇంటరాని చెప్పారు . కానీ ఇంతవరకు మంచి వార్త వినలేదు .
అక్రిడేషన్లు
అక్రిడేషన్లది ఒక సమస్యగానే ఉంది . మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు అధికంగానే ఉన్నారు . ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పరిపాలనలో వచ్చిన మార్పుల వల్ల మన దగ్గర మండల వ్యవస్థ ఏర్పడింది. అందువల్ల విలేకర్లు మండల స్థాయివరకు వెళ్లారు .అందువల్ల విలేకర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. దానికితోడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. కానీ గుజరాత్ , ఉత్తర ప్రదేశ్ లలో చూడండి అక్కడ ఎంతమందికి ఇస్తున్నారో చెప్పండని మంత్రులు కేటీఆర్ , హరీష్ రావులు వివిధసందర్భాలలో అన్నారు .
హెల్త్ కార్డుల అమలు
జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులు ఇస్తామన్నారు . ఇచ్చారు . అందుకు ధన్యవాదాలు …కానీ వాటిని తీసుకోని కార్పొరేట్ హాస్పటల్స్ కు వెళ్ళితే చెల్లుబాటు కావడం లేదు .అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిఉంది. జర్నలిస్టుల నుంచి కొంత ఎమౌంట్ కలెక్ట్ చేసి హెల్త్ స్కీమ్ కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని జర్నలిస్టుల కోరిక …సరైన వైద్యం సకాలంలో అందక అనేక మంది జర్నలిస్టులు 40 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు మరణించారు. కరోనా సందర్భంగా రాష్ట్రంలో 200 మంది జర్నలిస్టులు మరణించారని తెలుస్తుంది. వారి కుటుంబాలు ఆనాధలైయ్యాయి. వారికీ ప్రభుత్వం చేసిన సహాయం కొద్దీ మొత్తంలో మాత్రమే …చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు కనీసం 10 లక్షలకు తగ్గకుండా సహాయం అందించాలని జర్నలిస్టులు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
గతంలో సంక్షేమం కార్యక్రమాల అమలు జరిగేయి. ఇప్పుడు అరకొరగానే జరుగుతున్నాయి. జర్నలిస్టులకు 100 కోట్ల నిధులు ఇచ్చామని అంటున్నారు . ఇక జర్నలిస్టులకు దళితబంద్ ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని అడుగుతున్నారు . దళిత బంద్ లాగానే జర్నలిస్ట్ బంద్ అమలు చేయాలనే డిమాండ్ ఉంది. సీనియర్ జర్నలిస్టులకు అనేక రాష్ట్రాలు పెన్షన్ పథకం అమలు చేస్తున్నాయి. దాన్ని మనరాష్ట్రంలో జర్నలిస్టులకు అమలు చేయాలనీ జర్నలిస్ట్ సంఘాలు కోరుతున్నాయి. చిన్న పత్రికలను ఆదుకునేందుకు వారికీ ప్రభుత్వం రాయితీలు కల్పించాలని , ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ ఉంది .ఇప్పడు డిజిటల్ మీడియా దూసుకొస్తోంది. దాన్ని కూడా ఆదరించాలి వారికీ కూడా అక్రిడిషన్లు ఇవ్వాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్ని రంగాల్లో సానుకూల నిర్ణయాలు తీసుకోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చేసేలా చేసిన కేసీఆర్ జర్నలిస్టులకు విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దేశంలోని మీడియా రంగం మెచ్చుకునేలా చేయాల్సి ఉంది. అందుకు బీఆర్ యస్ అధ్యక్షుడిగా , తెలంగాణ రాష్ట్ర సీఎం గా జర్నలిస్ట్ లకు మేలుచేస్తారని ఆశిద్దాం …..!