నలుగురిని చంపిన చిరుతకు జీవితఖైదు!
- బోనులోనే బంధించి ఉంచనున్న అధికారులు
- రక్తం రుచి మరిగిన పులి.. వదిలితే ప్రమాదమేనని వ్యాఖ్య
- ఉత్తరప్రదేశ్ లో నలుగురు గార్డులపై దాడి చేసిన చిరుత
ఫారెస్ట్ గార్డులు నలుగురిని చంపిన చిరుతను బంధించిన అధికారులు.. దానిని జూకు తరలించి, జీవితాంతం బోనులోనే ఉంచాలని నిర్ణయించారు. రక్తం రుచి మరగడంతో చిరుతను వదిలిపెట్టడం ప్రమాదకరమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈమేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరీ జిల్లా అటవీ అధికారులు వివరాలను వెల్లడించారు.
ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి అక్టోబర్ 20 వరకు గోలా తహసీల్ పరిధిలో నలుగురు గార్డులు చిరుత దాడిలో చనిపోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. గోలా అటవీ పరిధిలో దాదాపు 25 సీసీ కెమెరాలు బిగించి చిరుత కదలికలను గమనించారు. ఫారెస్టు గార్డులపై దాడి చేసిన చిరుత ఆనవాళ్లతో పోల్చుకుని, దాడికి పాల్పడిన చిరుతను గుర్తించారు. ఆపై ఆరు చోట్ల బోనులతో ట్రాప్ చేయగా.. సోమవారం చిరుత చిక్కిందని తెలిపారు.
లఖీంపూర్ ఖేరీ డివిజన్ అటవీ అధికారి సంజయ్ బిశ్వాల్ మాట్లాడుతూ.. బోనులో చిక్కిన చిరుత పూర్తి ఆరోగ్యంగా, దృఢంగా ఉందని చెప్పారు. సాధారణంగా గాయపడిన చిరుతలు వేటాడేందుకు ఓపిక లేక మనుషులపై దాడి చేస్తాయని చెప్పారు. కానీ ఈ చిరుత మాత్రం రక్తం రుచి మరిగి మనుషులపై దాడులు చేస్తోందని పేర్కొన్నారు. దీంతో బతికున్నంత వరకూ ఈ చిరుతను బోనులోనే ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.