దారి మళ్లించిన నిధులు తిరిగిచ్చేయండి.. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు!
- ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై కేంద్రం సీరియస్
- వేరే పథకాలకు మళ్లించిన రూ.152 కోట్లు చెల్లించాలని నోటీసులు
- లేదంటే తదుపరి నిధుల విడుదల నిలిపివేస్తామని హెచ్చరిక
తెలంగాణలో ఉపాధి హామీ నిధులను వేరే పథకాలకు దారిమళ్లించడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ పథకంలో అవకతవకలపైనా కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దారిమళ్లించిన నిధులను వెంటనే తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. ఇందుకోసం నవంబర్ 30వ తేదీని గడువుగా పేర్కొంది. ఆ లోపల నిధులు తిరిగి చెల్లించకపోతే ఇకపై ఈ పథకానికి నిధుల విడుదలను నిలిపేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చిన నిధుల్లో నుంచి రూ.152 కోట్లను తెలంగాణ ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లించింది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధుల దుర్వినియోగం, దారిమళ్లింపులు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించింది. జూన్ 9 నుంచి 12 వరకు నిధుల వినియోగానికి సంబంధించి రికార్డులను తనిఖీ చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించి నిధుల మళ్లింపులో నిజానిజాలను నిర్ధారించుకుంది.
ఉపాధి హామీ పథకం అమలులో, పనుల కేటాయింపులలో అవకతవకలు జరిగాయని, కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించి వేరే పథకాలకు ఉపయోగించిందని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నిధులను అనుమతి లేని పనులకు ఖర్చు చేసినట్లు అందులో వివరించింది. కాగా, ఇప్పటికే పలు విషయాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజా నోటీసుల జారీ చర్చనీయాంశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.