Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీఆర్ యస్ ఆవిర్భావం బీజేపీకి లాభమా? నష్టమా …?

బీఆర్ యస్ ఆవిర్భావం బీజేపీకి లాభమా? నష్టమా …?
-ఎంఐఎం ,ఆప్ లాగానే బీఆర్ యస్ పయనిస్తుందా?
-బీజేపీ ,బీఆర్ యస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం
-కాంగ్రెస్ టార్గెట్ గా బీజేపీ ,బీఆర్ యస్ లు వ్యవరిస్తున్నాయా ?
-బీఆర్ యస్ అసలు లక్ష్యం ఏమిటి ?
-బీజేపీని ఎదుర్కొనే శక్తి బీఆర్ యస్ కు ఉందా?

భారత దేశ చిత్రపటంపై బీఆర్ యస్ అనే పార్టీ కొత్తగా ఆవిర్భవించింది. కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటు అయినా ఆపార్టీకి ఇప్పటివరకు ఒక్క తెలంగాణ నుంచి మినహా ఎక్కడనుంచి పెద్దగా మద్దతు లేదు .పార్టీ పెట్టేందుకు బలమైన కారణం కూడా కనిపించడంలేదు . ప్రజలను , ప్రధానంగా యువతను ,విద్యార్థులను కార్మిక ,కర్షకులను నడిపించాకలిగే బ్రహ్మస్త్రం లేదు…మరి ఎవరికోసం ,ఎందుకోసం పార్టీ అనే సందేహాలు లేకపోలేదు …ఇది కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకేనని పరిశీలకుల అభిప్రాయం . అదే సందర్భంలో బీజేపీని కట్టడి చేసేందుకు కేసీఆర్ సొంతపార్టీతో రంగంలోకి దిగుతున్నాడని అనేక మంది తమ నేతను దేశ్ కి నేతగా చూడాలని అంటున్నారని గులాబీ శ్రేణులు అంటున్నాయి.

పార్టీ పెట్టుకోవడం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ..ఎవరైనా పెట్టుకోవచ్చు ..ఇందులో ఎవరికీ అభ్యంతరాలు ఉండకపోవచ్చు ….కానీ పెట్టిన పార్టీ లక్ష్యాలు ఏమిటి ? ఎందుకోసం పార్టీ పెట్టారు . దేశంలో ప్రస్తుత పరితితుల్లో మరోపార్టీ అవసరం అవకాశం ఉందా ? అంటే లేదనే అంటున్నారు పరిశీలకులు . అసలు బీఆర్ యస్ పార్టీ పెట్టడం వల్ల ఎవరికీ లాభం ? ఎవరికీ నష్టం … బీజేపీని కాంగ్రెస్ ని నిజంగా ఎదురించి నిలబడే శక్తి, సత్తా కేసీఆర్ జాతీయపార్టీకి ఉందా ? అంటే ఇప్పటికైతే క్వీశ్చన్ మార్కే… బీజేపీ , బీఆర్ యస్ మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధం వెనక ఉన్న అసలు కథ ఏమిటి ? బిహైండ్ ద కార్త్యన్ ఏమైనా ఉందా ? నిజంగా యుద్ధం జరుగుతుందా లేక కాంగ్రెస్ ను ఖతం చేయాలనే గేమ్ ప్లాన్ లో భాగంగా ఇది జరుగుతుందా ? అనే అనుమానానాలు లేకపోలేదు . బీఆర్ యస్ ఏర్పాటు పై రాజకీయపరిశీలకులకు సైతం ఆశ్చర్యాన్ని కల్గిస్తూ,ఆసక్తిని రేకెత్తిస్తుంది … ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం , ఆప్ పార్టీల పోటీ బీజేపీకి లాభం చేకూర్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి. బీఆర్ యస్ కూడా అదే విమర్శలను మూటకట్టుకుంటుందా లేక బీజేపీ వ్యతిరేక పోరాటంలో తన నిజాయతీని నిలుపుకుంటుందా ?అనేది చూడాల్సి ఉంది.

బీజేపీ ,టీఆర్ యస్ మధ్య వచ్చిన పొరపొచ్చాలు బీఆర్ యస్ ఆవిర్భావానికి కారణం అయ్యాయా ?అంటే అంత బలమైన కారణాలు కన్పించటంలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సంవత్సరకాలం వరకు బీజేపీ తో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగిన టీఆర్ యస్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది .బీజేపీ వ్యతిరేక పోరాటం అంటుంది . నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో అందరికన్నా ముందు అసెంబ్లీలో తీర్మానం చేయించిన కేసీఆర్ బీజేపీ నిర్ణయాలకు జైజైలు పలికారు . తర్వాత మూడు వ్యవసాయ చట్టాలను ముందు వ్యతిరేకించి రోడ్ల దిగ్బంధనం చేయించిన కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు . ఢిల్లీ వెళ్లి రైతులు జరుపుతున్న నల్లచట్టాల వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇస్తారని అనుకుంటే అసలు అటువైపు కన్నెత్తికూడా చూడలేదు . రైతుల ఉద్యమానికి మద్దతుగా కూడా మాట్లాడలేదు . ఈలోగా ఏమి జరిగిందనేది ఎవరికీ తెలియని బ్రహ్మరహస్యంగా ఉంది .

 

నిశితంగా పరిశీలిస్తే ఇందులో ఎదో జరుగుతుంది అనే సందేహాలు కలుగుతున్నాయి . బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ అది పూర్తీ చేయకుండానే బీఆర్ యస్ అనే జాతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాలు అంటున్నారు . బీఆర్ యస్ పట్ల దేశంలో పెద్ద రెస్పాన్స్ కనిపించడం లేదు . కానీ అందరు కోరుకుంటున్నారు బీజేపీ ,కాంగ్రెస్ కు మీమే ప్రత్యాన్మాయం అంటున్నారు గులాబీ శ్రేణులు .

తెలంగాణ మోడల్ అభివృద్ధి అంటున్నారు . అసలు తెలంగాణాలో జరిగిన అభివృద్ధి ఏమిటి ? పోడుభూముల సమస్య పరిష్కరానికి తానే నెలరోజుల్లో వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని పరిష్కరిస్తానని స్వయంగా కేసీఆర్ 2018 ఎన్నికల్లో ఊరూరా తిరిగి ప్రచారం చేశారు . కానీ అది ఇంతవరకు అమలు కాలేదు .ఫలితంగా ఏజన్సీలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఇటీవలనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ మండలంలోని ఎర్రబోరు లో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రావు గొత్తికోయల చేతిలో హత్యకు గురైయ్యారు . ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం వల్లనే జరిగిన హత్యగా ప్రతిపక్షాలు , గిరిజనసంఘాలు ఆరోపిస్తున్నాయి. రైతుబంధు అమలుపై అనేక విమర్శలు ఉన్నాయి. ఇన్ కం టాక్సీ కట్టే వాళ్లకు , వందలు ఎకరాలు కలిగి ఉన్నవారికి ,భూస్వాములకు ,ఇవ్వడంపై అభ్యంతరాలు ఉన్నాయి. ఇది సరైందికాదని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇక దళిత బంధు అని ఆర్బాటంగా పెట్టిన కేసీఆర్ అక్కడక్కడా అమలు చేసి రాష్ట్రం అంతా అమలు చేసినట్లు చెబుతున్నారు .ఇది పూర్తిగా అన్యాయం .ఇప్పటికి కొందరు ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నేతలు దళితబంధు ఇప్పిస్తామని చెప్పి లబ్ధిదారులుగా ఎంపిక చేయిస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటున్నట్లు విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. మిషన్ భగీరథ , మిషన్ కాకతీయ పథకాల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఇక అనేక వర్గాలకు చేసిన వాగ్దానాలు నెరవేరలేదు .పైగా తెలంగాణ మోడల్ దేశమంతా కోరుకుంటుందని చెప్పుకోవడం అతిశేయోక్తిగా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఒక తెలుగు వ్యక్తిగా , తెలంగాణ రాష్ట్రం సాధించిన వాడుగా పేరుతెచ్చుకున్న కేసీఆర్ జాతీయపార్టీ పెట్టడం హర్షణీయం.కానీ అది ఎవరి లాభం కోసమో పెడితే అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు .ఇక ఏకవ్యక్తి నిర్ణయాలకు ,కుటుంబపాలనకు అలవాటు పడ్డ వారికీ జాతీయపార్టీని నడపడం సులభం కాదు .జాతీయపార్టీకి వివిధరాష్ట్రాల నుంచి నాయకులను తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే కేసీఆర్ చెప్పినట్లే వింటారనే గ్యారంటీ లేదు . భిన్న అభిప్రాయాలు వాదనలు చర్చోపచర్చలు విని సహించే ఓపిక ,సహనం తెచ్చుకోవాల్సి ఉంటుంది . నియంతలా కాకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అందరిని కలుపుకొని పోయే మనస్తత్వం ఉంటె బీఆర్ యస్ కు మనుగడ ఉంటుంది .లేకపోతె ఫైల్యూవర్ స్టోరిగా మారుతుంది. తస్మాత్ జాగ్రత్త ….!

 

Related posts

త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ … కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి అవకాశం!

Drukpadam

పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ ప్రయాణమెటు …?

Drukpadam

చెల్లెలుకి అన్న ఆశీస్సులు ఉంటాయి -కొండా రాఘవరెడ్డి

Drukpadam

Leave a Comment