నటులకు కలిసి రాని ఎన్నికలు.. ఉదయనిధి మినహా అందరూ ఓటమి!
- బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఖుష్బూ, సురేశ్ గోపీ ఓటమి
- కోయంబత్తూరు సౌత్‌లో కమలహాసన్‌కు ఎదురుదెబ్బ
- స్టాలిన్ కుమారుడు ఉదయనిధి భారీ మెజారిటీతో గెలుపు
నిన్న విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సినీ నటులకు చేదు గుళికలుగా మారాయి. కేరళలోని త్రిస్సూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సురేశ్ గోపీ ఓటమి పాలయ్యారు. తమిళనాడులోని థౌజండ్ లైట్స్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన ప్రముఖ నటి ఖుష్బూ డీఎంకే నేత ఎళిలన్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడిన ఆమె బీజేపీలో చేరారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని భావించిన ప్రముఖ నటుడు కమలహాసన్‌కు కూడా చుక్కెదురు అయింది. మక్కల్ నీది మయ్యం పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగిన ఆయనకు కలిసి రాలేదు. ఆ పార్టీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. ఇక కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల హాసన్ తన సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసన్ (బీజేపీ) చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన డీఎంకే చీఫ్ స్టాలిన్ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి దాదాపు 60 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.